దిశ, మెదక్: మెదక్ జిల్లా జికేఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన 'దళిత బంధు' అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు ను లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా దళిత కుటుంబాలు ఎదగాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం మొదలు పెట్టింది. మెదక్, ఆందోల్, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మొదటి లబ్ధిదారుల జాబితాలో 256 మంది ఉండటం వారి అదృష్టమన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఇలా పది లక్షలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. బ్యాంక్ లోన్‌ల కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి కష్టం లేదన్నారు. ప్రస్తుతం వంద మందికి ఇస్తున్నం. మార్చి తర్వాత నియోజకవర్గంలో 2000 మందికి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.