'దిశ' పత్రిక కథనాలకు స్పందించిన మైనింగ్ అధికారులు.. ఇసుక మాఫియాపై ఎంక్వయిరీ..
దిశ, ప్రతినిధి, వరంగల్ : ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు..latest telugu news
దిశ, ప్రతినిధి, వరంగల్ : ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే విచారణ చేపడతామని మైనింగ్ అండ్ జియోలజీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి 'దిశ' ప్రతినిధికి వెల్లడించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ఇసుక క్వారీల నుంచి పెద్ద మొత్తంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సాక్ష్యాధారాలతో సహా దిశ పత్రిక కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న తీరును మైనింగ్ అండ్ జియోలజీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి దృష్టికి దిశ ప్రతినిధి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. వెంటనే విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. అక్రమంగా తవ్వకాలు, రవాణా జరుపుతున్న క్వారీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక స్థానిక అధికారుల గురించి కూడా ఆరా తీస్తామని చెప్పారు.
ఇసుక అక్రమాలపై దిశ వరుస కథనాలు..
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై దిశ పత్రిక వరుస కథనాలను ప్రచురించింది. ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, రవాణా, అధిక లోడు, రాత్రిపూట తవ్వకాలు, సీసీ కెమెరాల తొలగింపు, సొసైటీ క్వారీల్లో యంత్రాల వినియోగం ఇలా అనేక అక్రమాలపై సవివరమైన కథనాలు రాసింది. ఈ కథనాలపై అటు మైనింగ్ అధికారులతో పాటు ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ అధికారులు క్వారీ ఏరియాల్లో పరిస్థితులను, కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరును, అక్రమ తవ్వకాల్లో అనుసరిస్తున్న విధానాలపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు చేర వేసినట్లుగా తెలుస్తోంది. ఇసుక కాంట్రాక్టర్లు నిబంధనలకు పాతరవేస్తున్న అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇసుక దోపిడీకి సహకరిస్తూ కాంట్రాక్టర్లు ఇచ్చే కొంత పర్సంటేజీకి అధికారులు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఎన్ని అక్రమాలు చేసినా చూస్తున్నారు తప్పా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇసుక దందాకు సహకరిస్తున్న అధికారులపై త్వరలోనే చర్యలుంటాయని విశ్వసనీయంగా తెలిసింది.