బరా 'బార్ '..! అక్కడ ఉదయం 6 నుంచే మద్యం అమ్మకాలు

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ నగరం, కాజీపేట, హనుమకొండలో క్లీనింగ్ పేరిట బార్ షాపులు కొన్ని latest telugu news..

Update: 2022-03-28 07:01 GMT



దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ నగరం, కాజీపేట, హనుమకొండలో క్లీనింగ్ పేరిట బార్ షాపులు కొన్ని తెల్లవారు జామునే తెరుచుకుంటున్నాయి. భవన నిర్మాణ కార్మికులు, మార్కెట్‌కు వచ్చే కొందరు వ్యక్తులను ఆసరాగా చేసుకుని బార్ షాపు యజమానులు కొందరు ఉదయం 6 గంటల నుంచే దొడ్డిదారిన వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తాగేవారు వస్తున్నారు కాబట్టి అమ్ముతున్న మంటూ వ్యాపారులు దురుసుగా సమాధానం చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు సైతం నిర్లక్ష్యంగానే జవాబివ్వడం విస్మయం కలిగిస్తోంది.

వరంగల్‌లో ఎక్కడెక్కడంటే..!

ప్రధానంగా వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో, కాశిబుగ్గ సెంటర్‌లో ఓ షాపు, పోచమ్మ మైదాన్, ఎస్విఎన్ రోడ్డు, గోపాలస్వామి గుడి సెంటర్, మార్కెట్ ప్రాంతం, లేబర్ కాలనీ ఏరియాలో గల షాపులు ఉదయాన్నే తెరుచుకుంటున్నాయి. పలు షాపులకు ప్రధాన ద్వారం తో పాటు మరో ద్వారం ఉండడంతో వీరి వ్యాపారం గుట్టుగా సాగుతోంది. అంతేకాదు కొన్ని షాపుల్లో పై భాగంలో కోసి వేసిన కొలత పావులు పడుతున్నట్లు తెలుస్తోంది. 90 ఎం ఎల్ కు సుమారు 10 ఎం.ఎల్ వరకు తక్కువ మద్యం అందిస్తూ మద్యం ప్రియులను వ్యాపారులు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ విషయమై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇనుప పావులు వాడాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.

ఈ మేరకు కొన్ని షాపులు ఇనుప పావులు వాడుతున్నప్పటికీ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇనుప పావుల అడుగుల్లో చిన్న చిన్న ఇనుప బిల్లలు వేసి ఈ దోపిడీని నిరాటకంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా మద్యం ప్రియులు కొలతల విషయంలో వ్యాపారులను నిలదీస్తే ' ఇష్టం ఉంటే తాగు .. లేకపోతే లేదు .. ' అంటూ వ్యాపారులు దురుసుగా మాట్లాడు చున్నట్లు కొందరు మద్యం ప్రియులు పేర్కొంటున్నారు. అంతేకాదు,ఉదయం వేళల్లో అమ్మే కొన్ని రకాల మద్యం తేడా కల్తిగా ఉంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొరవడిన ఎక్సైజ్ నిఘా

నగరంలో మద్యం వ్యాపారం పై ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా కొరవడి నట్లు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.పలు బార్ షాపులు ఉదయాన్నే తెరుచుకోవడం వెనుక ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మద్యం వ్యాపారులు సమయపాలన పాటించక పోవడం తో పాటు వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతోంది.

తెలియంది ఏముంది..

బార్ షాపుల నిర్వాహాకం పై ఎక్సైజ్ శాఖ అధికారులను ప్రశ్నించబోతే విచిత్ర సమాధానం ఎదురైంది. 'షాపులు తెల్లవారు జామునే తెరుస్తున్నారని అడిగితే ' ఈ విషయం తెలియంది ఎవరికి ? అంటూ ' ఓ అధికారి జవాబివ్వడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు, ఒక్కో బార్ షాప్ యజమాని ప్రభుత్వానికి ఏడాదికి 44 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.. మరీ వాళ్లు సంపాదించుకోవద్దా.. అంటూ వ్యాపారులకు వంతపాడడం.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.

దీని వెనుక అధికారులకు నెలనెలా ముడుపులు ముడుతున్నట్లుగా అర్థమవుతోంది. వాస్తవంగా అంత పెట్టుబడి పెట్టినప్పుడు వ్యాపారం చేసుకోవాల్సిందే. అయితే, నిబంధనలను కాదని వ్యాపారం నిర్వహించడం, అందునా ఆరోగ్యానికి హానికరమంటూనే యథేచ్ఛగా బిజినెస్ చేయడం ఎంతవరకు సబబో అధికారులే సెలవివ్వాలి. అదీగాక మద్యం కొలతల్లో మోసం చేయడం పై కూడా అధికారులే స్పందించాలి.

Tags:    

Similar News