వరంగల్‌లో కేరళ కిలాడి దంపతుల మోసాలు.. చెక్ పెట్టిన పోలీసులు
దిశ ప్రతినిధి, వరంగల్: నకిలీ కంపెనీల్లో పెట్టుబడులను పెట్టించి కోట్లాది రూపాయలను..Kerala Couple Arrested for Cheating
దిశ ప్రతినిధి, వరంగల్: నకిలీ కంపెనీల్లో పెట్టుబడులను పెట్టించి కోట్లాది రూపాయలను ఖాతాదారుల నుంచి కొల్లగొడుతున్న కేరళ కిలాడి దంపతులను శుక్రవారం వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం, సుబేదారి పోలీసులు సంయుక్తంగా కలిసి చేసిన దాడుల్లో కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన దంపతులు రేష్మి రవీంద్రన్ నాయర్, బిజ్జు మాధవన్‌లు పట్టుబడ్డారు. వీరితోపాటు మోసాలకు పాల్పడుతున్న గొగుల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పట్టుబడిన దంపతుల నుంచి పోలీసులు సూమారు రూ.2 లక్షల 50 వేల విలువ గల 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, హర్డ్ డిస్క్ లు, స్వైపింగ్ మిషన్, ఎనిమిది సెల్ ఫోన్లు, చెక్ బుక్ లు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, స్టాంపులు, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరి అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ.. రేష్మి రవీంద్రన్ నాయర్, బిజ్జు మాధవన్ దంపతులు జల్సా జీవనానికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కంపెనీల పేర్లు చెప్పి జనం నుంచి షేర్ మార్కెట్ లో పెట్టుబడులంటూ వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. కిలాడి దంపతులపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిందన్నారు. దీంతో నిందితులు తమ మకాంను ఢిల్లీకి మార్చి పీవీఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రై. లిమిటెడ్ అనే బోగస్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు.
హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో ఈ సంస్థ తరఫున ప్రతినిధులను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. పీవీఆర్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్ లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 4 నుంచి 8 శాతం వరకు కమిషన్ అందజేయడం జరుగుతుందని ప్రజలను నమ్మించేవారని అన్నారు. ప్రజలకు తమపై నమ్మకం కలిగించేందుకుగాను ముందుగా నిందితులు ప్రజలు పెట్టిన పెట్టుబడికి పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లించేవారని, కంపెనీపై నమ్మకం కుదిరిన ప్రజలు పీవీఆర్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్ లైన్ లో నకిలీ కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభించారన్నారు. దీంతో ఎక్కువ మొత్తంలో తమ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయిన వెంటనే ఈ కిలాడి దంపతులు బ్యాంకు నుండి డబ్బును డ్రా చేసుకుని ప్రజలను మోసం చేసేవారని తెలిపారు. హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు గోగుల శ్రీనివాస్ ద్వారా పీవీఆర్ కన్సల్టెన్సీ ద్వారా సుమారు కోటి రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టించాడు. కొద్దిరోజులు సక్రమంగానే కమీషన్ చెల్లించిన నిందితులు కొద్ది రోజుల అనంతరం నిందితులు పీవీఆర్ కన్సల్టెన్సీను మూసివేయడంతోపాటు నిందితులు ఫోన్ లో అందుబాటులో లేకపోవడంతో పెట్టుబడి పెట్టిన బాధితుడు మోసపోయినట్లుగా గుర్తించాడు.
నిందితులపై సుబేదారిలో ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు సైబర్ క్రైంతో పాటు సుబేదారి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసుల ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్ళి కిలాడి దంపతులను అదుపులోకి తీసుకుంది. స్థానిక న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు తరలించడం జరిగిందని కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం తప్పించుకున్న మరో నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకోనేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కిలాడి దంపతులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఏసీపీ నందిరాంనాయక్, సైబర్ క్రైం, సుబేదారి ఇన్ స్పెక్టర్లు జనార్ధన్ రెడ్డి, రాఘవేందర్, ఎస్ఐ పున్నంచందర్, సైబర్ క్రైం ఎస్ఐ నిహారిక, ఏఏఓ ప్రశాంత్, ఏఎస్ఐ సత్తయ్య, సైబర్ క్రైం కానిస్టేబుల్ కిషోర్, సుబేదారి కానిస్టేబుళ్ళు కమల, రాములను పోలీస్ కమిషనర్ అభినందించారు.