నాయకుల 'బంధు'వు.. సొంత పార్టీ కార్యకర్తలకే 'దళిత బంధు'

Update: 2022-02-14 13:31 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: 'దళిత బంధు' పథకం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాసుల వర్షం కురిపించనుందా.. సొంత పార్టీ వారికే లబ్ధి చేకూరనుందా.. అస్మదీయులు, అనుకూలురకే మేలు కలుగనుందా.. టీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్ లు ఉన్న గ్రామాలనే ఎంపిక చేస్తున్నారా.. లబ్ధిదారులతో ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారా.. క్విడ్ ప్రో విధానంలో చెరో సగం డబ్బులు పంచుకునేందుకు రంగం సిద్ధమైందా.. అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే చెబుతున్నాయి.. తాజాగా నియోజకవర్గానికి 100 కుటుంబాల ఎంపిక విధానం అలాగే ఉంది.. 'దళిత బంధు' పథకం నేతలు, నాయకులు, కార్యకర్తలకు బంధువుగా మారనుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!

దళితులు వారి కాళ్లపై వారు నిలబడేలా, ఉపాధి మార్గాలు చూపి.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 'దళిత బంధు' పథకాన్ని అమలు చేస్తోంది. హుజురాబాద్ ఎన్నికల సమయంలో శ్రీకారం చుట్టిన ఈ పథకం.. అక్కడ కొంత మేర అమలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో అమలుకు నిర్ణయించారు.

తాజాగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా.. నియోజకవర్గానికి 100 కుటుంబాలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి సెగ్మెంట్లో 100 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా.. నియోజకవర్గానికి 100 చొప్పున వెయ్యి కుటుంబాలకు 'దళిత బంధు' పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించటంతో.. ఉపాధి కల్పించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు సాయం అందించాలని భావించగా.. గ్రామానికి ఒక్కరికి కూడా సాయం అందని పరిస్థితి. ప్రతి సెగ్మెంట్లో సుమారు 150-170 వరకు గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ లెక్కన ఒక్కో గ్రామ పంచాయతీలో ఒక్కరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు.

ఇక గ్రామ పంచాయతీలో ఒక్కరికి ఇస్తే.. మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందని భావించారు. సర్పంచ్ లు ఒకరిని ఎంపిక చేయగా.. మిగతా కార్యకర్తలు తమకు ఎందుకు ఇవ్వరని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యే లకు తలనొప్పిగా మారింది.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతి మండలానికి 15-20 మందిని తీసుకోవాలని భావించారు. దీంతో ఒక్కో మండలంలో ఒకటి, రెండు గ్రామాలనే ఎంపిక చేశారు. అందులోనూ దళిత కుటుంబాలు తక్కువగా ఉన్న గ్రామాలను తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించి.. దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ గా ఉన్న గ్రామాలనే ఇందుకు ఎంపిక చేయగా.. స్థానిక సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు వసూళ్ల దందా మొదలు పెట్టారు.

తమ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులకే లబ్ధి చేకూరేలా జాబితా సిద్ధం చేస్తున్నారు. మీకు లబ్ధి చేకూరుస్తామని.. తమకు సగం డబ్బులు ఇవ్వాలని ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. క్విడ్ ప్రో ఒప్పందం జరుగుతుండగా.. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.2-3 లక్షల వరకు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి 'దళిత బంధు' లో నేతల వసూళ్ల పర్వం మొదలైంది.

Tags:    

Similar News