Hydrated foods: వేసవిలో డీహైడ్రేషన్.. నివారించే ఆహారాలు!

దిశ, ఫీచర్స్ : వేసవి తాపం పెరిగిపోయింది. ఉదయం పది దాటకముందే భానుడు..latest telugu news

Update: 2022-04-05 06:22 GMT

దిశ, ఫీచర్స్ : వేసవి తాపం పెరిగిపోయింది. ఉదయం పది దాటకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎండలో అరగంట తిరిగితే చాలు.. శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే చాన్స్ ఉంది. కానీ రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లక తప్పదు. ఇలాంటి సందర్భంలో ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు తరచూ నీళ్లు తాగడంతో పాటు శరీరాన్ని అధిక సమయం హైడ్రేటెడ్‌గా ఉంచగలిగే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి నీటి శాతం సమృద్ధిగా ఉన్న పదార్థాలేంటో తెలుసుకోండి.

వాటర్ కంటెంట్‌ అధికంగా ఉండే పండ్ల రసాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచడమే కాక ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. నారింజ, ఆపిల్, నిమ్మరసంలో ఇలాంటి గుణాలు ఎక్కువ. ఇదే సమయంలో ఉప్పు, మసాలాలకు దూరంగా ఉండాలి. ఉప్పును పరిమితికి మించి తీసుకుంటే చెమట పట్టి, డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. వాస్తవానికి ప్రతిరోజు మన శరీరానికి సరిపడే ఉప్పును పండ్లు, కూరగాయల నుంచి సహజంగా పొందవచ్చు. కాబట్టి వేయించిన ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి.

వాటర్ మిలన్ :

సమ్మర్‌లో బాడీని చల్లబరిచి, డీహైడ్రేషన్ సమస్యను అధిగమించడంలో పుచ్చకాయ నంబర్ వన్. ఇందులో 92శాతం నీరు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. పుచ్చకాయాలో పుష్కలంగా లభించే విటమిన్ బి6.. మెదడు పనితీరును మెరుగుపరిచి, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పుచ్చలో ఉండే లైకోపిన్.. ఎండ తీవ్రత వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గించి తాజాదనం చేకూరుస్తుంది. ఇక శారీరక శ్రమతో అలిసిపోయిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

దోసకాయ :

దోసకాయలోనూ దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. ఇందులోని పొటాషియం హీట్‌స్ట్రోక్‌ను అడ్డుకోగలదు. దోసకాయలో ఉండే 'ఫిసెటిన్' అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్ మెదడు మెరుగైన పనితీరుకు తోడ్పడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే ఈ జ్యూస్.. ఉపవాస సమయాల్లో శరీరాన్ని శక్తివంతంగా ఉంచగలుగుతుంది. శరీర వేడిని తగ్గించడంతో పాటు ఊబకాయంతో బాధపడుతున్నవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉండగా, డయాబెటిస్‌‌ను కంట్రోల్‌లో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

కోకోనట్ వాటర్: 

94 శాతం వాటర్ కంటెంట్ కలిగే ఉండే కొబ్బరినీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాక కిడ్నీలో రాళ్లను నివారిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. శరీరంలోని అనేక రకాల టాక్సిన్స్ బయటకు పంపేయడంలోనూ కొబ్బరి నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక ఇతర జ్యూస్‌లతో పోలిస్తే కొబ్బరిలో చక్కెర, కార్బొహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సాయపడుతుంది.

పాలు, పెరుగు

పాలు కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూనే రీహైడ్రేటర్‌గానూ పనిచేస్తాయి. ఉపవాస రోజుల్లో శరీరానికి కావాల్సిన మొత్తంలో కాల్షియం కంటెంట్‌ను అందిస్తుంది. మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఉపవాసాలు చేసినపుడు పెరుగు తీసుకోవడం మంచిదే. ఎందుకంటే 88 శాతం నీరు ఉండే పెరుగులో ప్రోటీన్, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. శక్తిని పొందడంతో పాటు రీహైడ్రేట్ అయ్యేందుకు తాజా బెర్రీలతో కూడిన పెరుగు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బ్లాక్ బెర్రీస్

ఇందులో 88 శాతం నీరు ఉండగా, ఇది హైడ్రేటింగ్ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కె సహా ఫైబర్ అధికంగా ఉంటుంది.

Tags:    

Similar News