గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్‌లో ఇకపై అంతా మహిళా ఉద్యోగులే
దిశ ప్రతినిధి, మేడ్చల్: అంతర్జాతీయ - Gundla Pochampally railway station has been converted into a women's employees' railway station to mark Women's Day
దిశ ప్రతినిధి, మేడ్చల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ `మేడ్చల్ సెక్షన్‌లోని సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఒకటైన గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్‌ను మంగళవారం 'మహిళా ఉద్యోగుల రైల్వే స్టేషన్'గా ఏర్పాటుచేశారు. ఈ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల నిర్వహణ, సాంకేతిక సిబ్బంది, టికెటింగ్, భద్రత, ఇతర సంబంధిత రోజువారి కార్యకలాపాల విధుల నిర్వహణ కోసం పూర్తిగా మహిళా సిబ్బందినే నియమించారు. మహిళా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు మహిళా సిబ్బంది అన్ని రంగాల్లో రాణించడానికి వారిని ప్రోత్సహించడంలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. మహిళా శ్రామిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు మరియ వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్‌లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించి 'మహిళా ఉద్యోగుల రైల్వే స్టేషన్'గా ప్రకటించారు.
మహిళా ఉద్యోగులను ప్రోత్సాహించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన బేగంపేట్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ డివిజన్‌లోని విద్యానగర్ రైల్వే స్టేషన్, విజయవాడ డివిజన్‌లోని రామవరప్పాడు రైల్వే స్టేషన్, గుంటూరు డివిజన్‌లోని న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మరియు గుంతకల్ డివిజన్‌లోని చంద్రగిరి రైల్వే స్టేషన్ మొత్తం ఈ ఐదు రైల్వే స్టేషన్లు ఇప్పటికే పూర్తిగా మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్లుగా పనిచేస్తున్నాయి.
వీటితోపాటు మహిళా సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా లోకో పైలట్లు, ట్రాక్ నిర్వహణ వంటి క్లిష్టమైన విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ రంగాలలో లోకో పైలట్లు ` 53, స్టేషన్ మాస్టర్లు ` 64, ట్రాక్ నిర్వహణ సిబ్బంది ` 837 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాక దక్షిణ మధ్య రైల్వే మహిళా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ.. అనేక పురస్కారాలు సాధిస్తున్నారు. మహిళా క్రీడాకారుల సాధన కోసం.. వసతి కోసం జోన్ వారికి అనేక సౌకర్యాలను కల్పిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వేలో మహిళా సాధికారత కోసం చేపడుతున్న చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. జోన్‌లో మహిళల కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలు మహిళా ఉద్యోగులలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తోడ్పడతాయని ఆయన అన్నారు. రైల్వేలో మహిళా సిబ్బంది అత్యంత అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. మహిళల్లో సాధికారత కల్పించేందుకు, సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.