పన్ను చెల్లింపుకు వెనుకాడుతున్న గ్రేటర్ ప్రజలు.. దాని కోసం ఎదురు చూపులు..!

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను- latest Telugu news

Update: 2022-03-14 13:21 GMT
పన్ను చెల్లింపుకు వెనుకాడుతున్న గ్రేటర్ ప్రజలు.. దాని కోసం ఎదురు చూపులు..!
  • whatsapp icon

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది రెండు వేల కోట్ల రూపాయల పన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రజలనుండి ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. కరోనాతో సుమారు రెండేళ్లుగా వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం, అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాలు తగ్గడం వంటి వాటితో సకాలంలో చెల్లించలేకపోతున్నామని ప్రజల నుండి సమాధానం వస్తోందని పన్ను వసూలుకు ఇంటింటికి తిరుగుతున్న సిబ్బంది పేర్కొంటున్నారు. మరోవైపు గత ఏడాది మాదిరిగా జీహెచ్ఎంసీ ఒన్ టైం సెటిల్ మెంట్ (ఓటీఎస్) ఆఫర్ ఇస్తే చెల్లించేందుకు అనేకమంది ఆస్తుల యజమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ యేడాది ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు ముంచుకొస్తున్నా అంతంత మాత్రంగానే పన్ను వసూలు కొనసాగుతోంది.

శ్రీమంతుల ఇలాకాలో కూడా..

గ్రేటర్ పరిధిలో శ్రీమంతులు నివాసముండే ప్రాంతాలుగా గుర్తింపు పొందిన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో కూడా ఆస్తి పన్ను ఈ ఏడాది ఆస్తి పన్ను చెల్లింపుకు అంతగా ముందుకు రావడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు నిర్ధేశించిన లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో మాత్రమే ఆస్తి పన్ను వసూలు అధికారుల అంచనాలకు తగ్గట్లుగా వసూలైంది. గత సంవత్సరం ఈ సర్కిల్ పరిధిలో సుమారు రూ.167 కోట్ల పై చిలుకు వసూలు కాగా తాజాగా ఇప్పటికే రూ. 170 కోట్లకు పైగా ప్రజల నుండి చెల్లింపులు జరిగాయి.

ఓటీఎస్ కోసం ఎదురు చూపులు..

బల్దియా పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుకు ఒన్ టైం సెటిల్ మెంట్ (ఓటీఎస్) కింద రాయితీ ఇస్తే పన్ను చెల్లించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే పన్ను వసూళ్లు జరుగుతుండడంతో ఓటీఎస్ కింద తగ్గింపు ఉంటుందని చాలా మంది చెల్లింపుకు ముందుకు రావడం లేదు. కేవలం ఒక్క సంవత్సరం బకాయిలు ఉన్న వారు పన్ను చెల్లింపుకు ముందుకు వస్తుండగా బకాయిలు ఉన్న వారు ఓటీఎస్ కోసం ఎదురు చూస్తున్నారు .

తగ్గింపు కోసం చూస్తున్నాం.. లక్ష్మి నరసింహా.. కొత్త పేట

మేము కొత్తపేటలో మూడేళ్ల క్రితం అపార్ట్ మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కున్నాం. పన్ను చెల్లింపు విషయంలో అవగాహన లేకపోవడం, కరోనా వంటి కారణాలతో ట్యాక్స్ కట్టలేదు. ఇటీవల జీహెచ్ఎంసీ సిబ్బంది ఆస్తి పన్ను వసూలుకు కూడా వచ్చారు. అయితే జీహెచ్ఎంసీ నుండి ఏమైనా ఓటీఎస్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. ఓటీఎస్ వస్తే పన్ను పూర్తిగా చెల్లిస్తాం. జీహెచ్ఎంసీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. నాలాగే ఎంతో మంది రాయితీ వస్తుందనే ఆశతో ఉన్నారు.

Tags:    

Similar News