Tirupati: తిరుపతికి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల మంజూరు
దిశ,ఏపీ బ్యూరో : తిరుపతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తిరుపతిలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసింది.
దిశ,ఏపీ బ్యూరో : తిరుపతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తిరుపతిలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు మంజూరు చేసింది. విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయడంపట్ల తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పట్టణాన్ని సంవత్సరానికి 5.8 కోట్ల మంది సందర్శిస్తున్నారని అలాంటి తిరుపతి పట్టణంలో ఒక్క పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ లేదని, తిరుపతిలో చార్జింగ్ స్టేషన్ నెలకొల్పడం వలన విద్యుత్ వాహన వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎంపీ మద్దిల గురుమూర్తి గతంలో పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరారు. ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖామాత్యులు నితిన్ గడ్కరి సత్వరమే స్పందించి తిరుపతి పట్టణానికి ఫేమ్-2 స్కీం కింద మొత్తం 68 ఛార్జింగ్ స్టేషన్స్ మంజూరు చేశారు.
దేశం మొత్తం మీద విద్యుత్ వాహనాల్ని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రోత్సహించేందుకు వినియోగదారులకి సరసమైన ధరకి చార్జింగ్ అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్ విద్యుత్ చార్జింగ్ వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 30% విద్యుత్ వాహనాల విక్రయాలలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకుందని అందుకు తగిన విధంగా వాహన చార్జింగ్ వ్యవస్థని భలోపేతం చేస్తామని ఫేమ్ -II స్కీం కింద దేశం మొత్తంలో 2,877 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు మంజూరు కాగా అందులో తిరుపతి పట్టణానికి 68 చార్జింగ్ స్టేషన్‌లు మంజూరయ్యాయని వీటిని నాలుగు ఏజెన్సీలకి ఇచ్చామని తెలిపారు. అందులో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 18, రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ (ఆర్.ఈ.ఐ.ఎల్) – 10, ఆంధ్ర ప్రదేశ్ నెడ్ క్యాప్ లిమిటెడ్ - 20, ఎన్టీపీసీ -20 చార్జింగ్ స్టేషన్స్ కేటాయించామని తెలియజేశారు.ఈ చార్జింగ్ స్టేషన్స్ నిర్మాణ ప్రక్రియ దశల వారీగా జరుగుతుందని ముందస్తు ప్రాధాన్యతగా జన సాంద్రత అధికంగా ఉన్న పెద్ద నగరాలలో ఆ నగరాలని అనుసంధానించబడ్డ ఎక్స్ ప్రెస్ హైవేలలో నిర్మాణ లక్ష్యంగా పెట్టుకున్నదని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.