స్థిరమైన రికవరీతోనే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ: నిర్మలా సీతారామన్!

Update: 2022-02-21 12:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం స్థిరమైన రికవరీని కోరుకుంటోందని, అందుకే మౌలిక సదుపాయాల కల్పనపై బడ్జెట్‌లో ఆర్థికవ్యవస్థకు సహాయపడే విధంగా కేటాయింపు చేపట్టినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పరిశ్రమ వర్గాలతో బడ్జెట్ అనంతర సమావేశంలో మాట్లాడిన ఆమె.. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థికవ్యవస్థ బయటపడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించాం. ముఖ్యంగా స్థిరమైన రికవరీ, వృద్ధి పునరుద్ధరణకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చాం.

అలాగే సుస్థిరతకు, పన్నుల విధానంలో అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల మధ్య దేశీయంగా ప్రజలు చెల్లింపుల్లో ఇబ్బందులు పడకుండా టెక్నాలజీ ఎంతో సహాయపడిందని, భవిష్యత్తులో విద్య, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పరిష్కారాలను అమలు చేయడంపై పరిశీలనలు జరుపుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్‌లకు సహాయంగా మద్దతు కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు.

ఇదే సమావేశంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శి టి వి సోమనాథన్.. 2022-23 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు తగ్గడంపై వివరణ ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ అనేది రాష్ట్రాల బాధ్యత. అయినప్పటికీ కొన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలను కేంద్రం భరిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారెంటీ పథకం అందిస్తున్నట్టు, ఇందులో భాగంగా ఆరోగ్య రంగానికి రూ. 50 వేల కోట్ల వరకు సమకూరుస్తున్నామని, కార్పొరేట్ రంగం దీన్ని ఉపయోగించుకోవాలని వివరించారు.

Tags:    

Similar News