ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ!

Update: 2022-03-04 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రీజనల్ రింగు రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని బీజేపీ నేతలు చేసిన విజ్ఞప్తిపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే రైల్వే శాఖ అధికారులతో చర్చించి తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు కమలనాథులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రీజనల్ రింగు రోడ్డుకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తే తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్వామిగౌడ్ కోరగా స్పందించిన రైల్వే మంత్రి ట్రిపుల్ ఆర్ విస్తీర్ణం, ప్రాజెక్టు పురోగతిపై నేతలను అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణలో 10 జిల్లాలను కలుపుతూ 300 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగు రోడ్డును ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.20 వేల కోట్లు అవసరముందని, భూ సేకరణకయ్యే వ్యయంలో కేంద్ర రాష్ట్రాలు 50:50 శాతం వాటా భరిస్తున్నట్లుగా చెప్పారు. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఆయన బదులిచ్చారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు 100 మీటర్ల వెడల్పు ఉంటుందని తెలిపారు. స్పందించిన అశ్విని వైష్ణవ్​అందులో 30 మీటర్లు రైల్వే శాఖకు కేటాయిస్తే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన బీజేపీ నేతలకు సూచించారు.

Tags:    

Similar News