అన్ని పార్టీలకు ఎన్నో పాఠాలు నేర్పుతున్న ఎన్నికల ఫలితాలు
ఎన్నికల వ్యూహంతో పాటు, క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల వ్యూహంతో పాటు, క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలుగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అనేక విలువైన నేర్చుకోతగ్గ పాఠాలు చెప్పినట్లు తెలంగాణ ఇంటి పార్టీ భావిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత పోకడతో, ఒకే కుంటుంబం, ఒకే సామాజిక వర్గ ఆధిపత్యంతో బీజేపీకి ప్రత్యామ్నయం సాధ్యం కాదని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని నొక్కి చెప్పారు.
కులాల సమీకరణ, ఈవీఎంలు, బీఎస్‌పీ, ఎంఐఎం పార్టీల పోటీ, కొత్త కొత్త అభివృద్ధి డబుల్ ఇంజన్ ఫార్మూలా కలగలిపిన ఉత్తరప్రదేశ్‌లో యోగి బీజేపీకి బలమైన పోటీని సమాజ్‌వాదీ పార్టీ ఇచ్చిందన్నారు. బీజేపీ గెలుపుతో అడ్డు అదుపు లేని ప్రైవేటీకరణ, కార్పొరేట్ ఆధిపత్యంతో పాటు మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి పునాదులైన సెక్యులరిజం, అన్ని వర్గాల ప్రజల రక్షణ, అట్టడుగు వర్గాల ప్రజలకు సంపద సమ పంపిణీ మరింత అపహాస్యానికి గురవడానికి తామే బాధ్యులమని భవిష్యత్తులో ఫ్రంట్‌గా ఏర్పడే నాయకులు ఒప్పుకోలు ప్రకటించాలన్నారు. సామాజిక శక్తులు, కమ్యూనిస్టుల కనీస ప్రభావం లేకుండా జరుగుతున్న ఎన్నికల పరిణామాలు తెలుగు రాష్ట్రాలను, దక్షణాది పార్టీలను కూడా డిఫెన్స్‌లోకి నెట్టినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.
వ్యాధి ముదిరాక వైద్యం చేద్దామంటే రోగి బతకని తీరు పంజాబ్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయన్నారు. ఇందిరాగాంధీ హత్యనంతరం చెలరేగిన అల్లర్లలో సిక్కులు ఎట్లా బంజాబ్‌లో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారని ఆశ్చర్యపోయిన వాళ్ళ అంచనాలు మించి రెండు సార్లు కాంగ్రెస్‌కు పంజాబ్‌లో అవకాశం ఇచ్చారని, ముఠా కోట్లాటలు, ఆధిపత్య కుల అహంకారాలు, అదుపుతప్పిన పాలనా వ్యవస్థతో ముందుకు పోని అభివృద్ధి శాపమై కొంప ముంచిందన్నారు. ఉత్తరఖండ్, మణిపూర్, గోవాలో అనేక ఎత్తులతో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని బీజేపీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ప్రత్యామ్నయం అనే పార్టీలు కొత్త వ్యూహాలు, పొందికలు, సద్దుబాట్లు లేకుండా అది సాధ్యం కాదని గుర్తించాలన్నారు.