అసెంబ్లీలో కేసీఆర్‌కు ఆ విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ శనివారం జరిగిన..discused all issues of constituency in Assembly session

Update: 2022-03-12 13:06 GMT

దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ శనివారం జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా నియోజకవర్గం చుట్టుపక్కల సుదూరంగా 122 గిరిజన తండాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ మేరకు రూ. 35 కోట్ల వ్యయంతో భవన మంజూరుకు అంచనాలు కూడా తయారై పరిశీలనలో ఉన్నాయని.. ఈ మేరకు వెంటనే వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉందని వివరించారు. మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు భువనగిరి-యాదాద్రి జిల్లాలో, శాలిగౌరారం మండలం నల్గొండ జిల్లాలో, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలు సూర్యాపేట జిల్లాల పరిధిలోకి విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా మోత్కూర్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి మండల కేంద్రంలో కొత్త ఆస్పత్రులను (పీహెచ్ సీ) ఏర్పాటు చేస్తే సిబ్బంది పెరగడంతోపాటు ప్రజలకు కూడా లాభం ఉంటుందని వివరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కంటే అర్వపల్లి మండల కేంద్రంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అతి పురాతనమైనదని పేర్కొంటూ దాని అభివృద్ధికి రూ. 10 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. ఇప్పటికే కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ముఖ్యంగా చిన్న చిన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష ధోరణితో ప్రవర్తిస్తోందని, తెలంగాణ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతోందని కిషోర్ ఆరోపించారు. సర్వేల్ రెసిడెన్షియల్ గురుకులంలో తనతోపాటు ఎంతో మంది చదువుకుని వివిధ ప్రాంతాల్లో ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత పోస్టుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. అలాగే దీని పరిధిలో 35 పాఠశాలలు ఓపెన్ కేటగిరీ కింద కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఇలాంటివి నియోజకవర్గానికి ఒక పాఠశాలను కేటాయిస్తే నిరుపేదలు ఉన్న అగ్రవర్ణాలు కూడా ఎంతో లబ్ధి పొందుతారని కోరారు. దీంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ, తదితర విషయాలను ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో వివరించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..