ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నారా.. అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
దిశ, ఫీచర్స్: ఆధ్యాత్మికపరమైన ఉపవాసానికి, ఆకలితో కడుపు మాడ్చుకోవడానికి మధ్యన పూరించలేనంత తేడా ఉంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్: ఆధ్యాత్మికపరమైన ఉపవాసానికి, ఆకలితో కడుపు మాడ్చుకోవడానికి మధ్యన పూరించలేనంత తేడా ఉంది. రీసెంట్‌గా ఒక హిందీ నటి దైవ ప్రార్థనల్లో భాగంగా చాలా రోజుల పాటు ఉపవాస దీక్ష చేయడంతో ఆస్పత్రి పాలైంది. శరీరానికి అవసరమైన లవణాలు, ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడటమే ఆమె మూర్ఛపోయేందుకు దారితీసింది. ఈ ఇన్సిడెంట్ 'ఉపవాసం, ఆకలి' పూర్తిగా భిన్నమైనవని స్పష్టం చేస్తోంది. అయితే చాలా మంది బరువు తగ్గే లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో భోజనాన్ని స్కిప్ చేయడాన్ని ఒక అనుకూలమైన మార్గంగా భావించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆరోగ్యానికి హాని కలగకముందే ఈ రెండింటి మధ్య బేధాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉపవాసం అంటే ఏమిటి?
ఉపవాసం అంటే రోజు తీసుకునే ప్రధాన ఆహారాన్ని(సాధారణంగా ధాన్యాలు వంటివి) ఇతర ఆహార పదార్థాల(పండ్లు/కూరగాయలు/మిల్లెట్స్)తో భర్తీ చేయడం. ఉదాహరణకు ఉపవాసం ఉండే ప్రజలు ఏకాదశి సమయంలో అన్నం తినరు. పవిత్ర మాసాల సందర్భంగా 45 రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు లేదా రంజాన్ సమయంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే తింటారు. నిజానికి 'ఇది చాలా పురాతన అభ్యాసం. శాస్త్రీయంగానూ వివరించబడిన ఈ పద్ధతికి ఒక రిథమిక్ నమూనా ఉంది. ఉపవాస సమయంలో శరీరానికి 'పోషకాహారం (కార్బోహైడ్రేట్లు/ప్రోటీన్/కొవ్వు)' లభించదు. అందుబాటులో ఉన్న ఆహారమే అన్ని భాగాలకు సమంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది' అని బెంగళూరులోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ శరణ్య శాస్త్రి వెల్లడించారు.
ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు :
* మనుషులను శక్తివంతం చేయడమే కాక బాడీ సిస్టమ్‌కు బ్రేక్ ఇస్తుంది.
* BMR (బేసల్ మెటబాలిక్ రేట్)ను మెరుగుపరచడంలోనూ సాయపడుతుంది.
* ఈ టైమ్‌లో యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాన్ని(పండ్లు/కూరగాయలు/మిల్లెట్‌లు ఎక్కువగా) తీసుకోవడం ద్వారా శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గేందుకు తోడ్పడటమే కాక ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది.
* ఆయా వ్యక్తుల శరీరంలో ఒక రిథమ్‌ను సెట్ చేసి తేలికగా, ఆరోగ్యంగా, బలంగా తయారుచేస్తుంది. అందువల్ల ఎసిడిటీ/ఉబ్బరం/మలబద్ధకంతో పాటు అతి తిండి సమస్యలను దూరం చేస్తుంది.
ఉపవాస సమయంలో ఏం గుర్తుంచుకోవాలి?
ఎవరైనా ఉపవాసం ఉంటున్నట్లయితే పోషకాలను సమతుల్యం చేయడం ముఖ్యం. బాడీ సిస్టమ్‌లో ఎక్కువ ఆహారం లోడ్ చేయకూడదు. అందుకోసం ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి.
* పండ్లు లేదా ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమించాలి.
* ఎక్కువ సమయం ఉపవాసం ఉన్నట్లయితే నీరు లేదా షర్బెత్(కోకుమ్/నిమ్మ) పుష్కలంగా తాగాలి. వేసవికాలంలో అయితే మజ్జిగ/లేత కొబ్బరి నీరు తీసుకోవచ్చు.
* ఉపవాసం విరమించగానే సాబుదాన(సాగో) తయారు చేసుకోవాలి.
* ఉపవాసం ప్రారంభించే ముందు రైస్ ఫ్లేక్స్ తయారు చేసుకోవాలి. ఇది కడుపు నింపడంతో పాటు సరిపడా ఐరన్ లెవెల్స్‌ను అందిస్తుంది.
* ఉపవాసం ఉన్నప్పుడు శీతల పానీయాలు/ప్రాసెస్ చేసిన ఆహారాలు/శుద్ధి చేసిన చక్కెర (రసాలను త్రాగడానికి సిద్ధంగా ఉన్నవి) మానుకోవాలి.
* ఈ సమయంలో పప్పులు లేదా కాయధాన్యాలు తింటే గ్యాస్ట్రిక్ ఉబ్బరానికి కారణమవుతాయి.
కడుపు మాడ్చుకోవడం(Starvation) అంటే?
కడుపు మాడ్చుకోవడం అంటే బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల పరంగా 'కేలరీలు' కోల్పోవడం మాత్రమే. దీని వెనుక ఎటువంటి నమూనా, శాస్త్రీయ వివరణ లేదు. పైన తెలిపినట్లుగా బాలీవుడ్ నటి ఉపవాసం పేరుతో ఆకలితో అలమటించింది. అప్పుడు ఆమె శరీరంలో లవణ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీన్ని బట్టి ఆహారాన్ని స్కిప్ చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రపరిచే అభ్యాసంలో మునిగిపోలేరు.
ప్రతికూల ప్రభావాలు ఉంటాయా?
కడుపు మాడ్చుకోవడం అంటే 'కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ప్రోటీన్ సహా కేలరీల పేరున ఆకలితో అలమటించడమే. ఇది బలహీనమైన అనుభూతిని మాత్రమే కలిగిస్తుంది. సమర్థవంతంగా, శాశ్వతంగా స్థిరమైన పద్ధతిలో బరువు తగ్గేందుకు సాయపడదు. శరీరంలో గందరగోళం, ఒత్తిడిని సృష్టిస్తుంది. తద్వారా జీవక్రియ అస్తవ్యస్థంగా మారి సూక్ష్మపోషకాలు(కాల్షియం/ఐరన్/సెలీనియం/జింక్) అందకుండా చేస్తుంది. మానసిక కల్లోలం, చికాకు, జుట్టు రాలడం, పాలిపోయిన చర్మం, బ్లడ్ షుగర్స్‌లో హెచ్చుతగ్గులు, తక్కువ రక్తపోటు, అలసట వంటివి ఆకలితో సాధారణ సంబంధమున్న ప్రతికూల ప్రభావాల్లో కొన్ని. కాబట్టి తమ జీన్స్ నిర్దిష్ట పరిమాణానికి సరిపోయేలా బరువు తగ్గేందుకు లేదా శరీరం నుంచి విషాన్ని వదిలించుకోవాలనుకుంటే.. దీర్ఘకాలంలో మీ ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ పద్ధతిని అనుసరించకూడదు.