ప్రాణాంతక స్పైడర్ విషంతో హార్ట్ ఎటాక్స్‌కు ట్రీట్మెంట్..
దిశ, ఫీచర్స్ : సర్వరోగ నివారణకు ప్రకృతిని మించిన ఔషధాలయం లేదనేది చాలామంది విశ్వాసం. ఆ మాటను నిజం చేసేలా ఇప్పుడు సాధారణ గుండెపోటుకు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సర్వరోగ నివారణకు ప్రకృతిని మించిన ఔషధాలయం లేదనేది చాలామంది విశ్వాసం. ఆ మాటను నిజం చేసేలా ఇప్పుడు సాధారణ గుండెపోటుకు.. అసాధారణ చికిత్సలు మనుషుల ప్రాణాలను ఎలా కాపాడతాయో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గుండెపోటు లేదా స్ట్రోక్ వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక సాలెపురుగు విషం నుంచి మందును అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఇది క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లనుంది.
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఈ మందును రూపొందించారు. ఇందుకోసం చరిత్రలో ఇప్పటివరకు లేనివిధంగా K'gari ఫనెల్-వెబ్ స్పైడర్(ఫ్రేజర్ ఐలాండ్ స్పైడర్‌గా కూడా పిలుస్తారు) విషం నుంచి ఒక అణువును ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 'IB001'గా పిలువబడుతున్న ఈ డ్రగ్‌పై బ్రిస్బేన్ స్టార్టప్ 'ఇన్ఫెన్సా బయోసైన్స్' లైసెన్స్ పొందింది.
గుండెపోటు తర్వాత, అదే సమయంలో మరణించిన కండర కణాలను గుండె పునరుత్పత్తి చేయలేకపోతుంది. అయితే 'IB001' గుండె కణాల మరణానికి కారణమయ్యే సంకేతాలను నిరోధిస్తుంది. దీన్ని గుండెపోటు బాధితులకు వెంటనే అందించినప్పుడు నష్టతీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో గుండె జబ్బులు ఉన్నవారికి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది' అని ఇన్ఫెన్సా సీఈవో, క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీకి చెందిన మార్క్ స్మిత్ చెప్పారు.
'ప్రస్తుతం స్ట్రోక్ నుంచి మెదడును నిరోధించేందుకు ఎటువంటి మందులు లేవు. స్ట్రోక్స్ తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడంలో కొంత సమయం గడిచిపోతోంది. ఇలాంటి సమయంలో ఈ మందు ద్వారా స్ట్రోక్ రకంతో సంబంధం లేకుండా వెంటనే కొంత రక్షణ పొందవచ్చు' అని క్వీన్స్‌లాండ్ యూనవర్సిటీ ప్రొఫెసర్ గ్లెన్ కింగ్ చెప్పారు.