సిటీ లైట్స్ వెలుగుల్లో మారుతున్న వృక్షాల 'లైఫ్ సైకిల్'

దిశ, ఫీచర్స్: రాత్రి సమయంలో వెలుగుతున్న సిటీ లైట్లు పట్టణంలోని మొక్కల ఫినాలజీకి అంతరాయం కలిగిస్తున్నాయని కొత్త అధ్యయనం వెల్లడించింది.

Update: 2022-07-18 11:19 GMT

దిశ, ఫీచర్స్: రాత్రి సమయంలో వెలుగుతున్న సిటీ లైట్లు పట్టణంలోని మొక్కల ఫినాలజీకి అంతరాయం కలిగిస్తున్నాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల మొగ్గలు వసంత కాలంలో ఆలస్యంగా చిగురిస్తుంటే, శరధృతువులో ఆకులు రాలిపోవడం లేదు. అంతేకాదు ఈ లైట్లు ప్రకృతిపరంగానే కాక అలెర్జీల నుంచి స్థానిక ఆర్థిక వ్యవస్థల వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

పలు యూఎస్ నగరాల్లోని సుమారు 3,000 సైట్స్‌లో వివిధ లైటింగ్ పరిస్థితులకు చెట్లు, పొదలు ప్రతిస్పందించే విధానాన్ని శాస్త్రవేత్తలు ఐదేళ్లపాటు పరిశీలించారు. సాధారణంగా మొక్కలు ఉష్ణోగ్రతతో పాటు కాలానుగుణ మార్పుకు సంకేతంగా నేచురల్ డే-నైట్ సైకిల్‌ను ఫాలో అవుతుంటాయి. అయితే రాత్రిపూట లైట్లు లేని సైట్స్‌తో పోలిస్తే, కృత్రిమ కాంతి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని చెట్లు వసంత కాలంలో సగటున తొమ్మిది రోజులు ఆలస్యంగా చిగురించాయి. ఆకుల్లో రంగు మారే ప్రక్రియ కూడా దాదాపు ఆరు రోజులు ఆలస్యమైంది. ఈ మేరకు కాంతి ఎంత తీవ్రంగా ఉంటే అంత ఎక్కువ తేడా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

భవిష్యత్తులో రాత్రిపూట కాంతి తీవ్రత వల్ల ఏదైనా సీజన్ ముందుగానే మొదలవుతుంది. కానీ ఆయా వృక్షాల సహజ ప్రక్రియలు మాత్రం సంక్లిష్టంగా మారతాయని పరిశోధకులు వెల్లడించారు. మొక్కల జీవ గడియారాల్లో ఈ రకమైన మార్పు.. పట్టణ మొక్కలు అందించే వాతావరణం, ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాలాల్లో పెరుగుతున్న మార్పులు వసంతంలో మంచు నష్టంతో పాటు మొక్కల దుర్బలత్వాన్ని కూడా పెంచుతాయి. మొక్కల ద్వారా పరాగసంపర్కం జరిపే ఇతర జీవుల జీవితచక్రాల్లోనూ ఈ మార్పు అసమతుల్యతను సృష్టించగలదు. అంతేకాదు మొక్కలు చాలా త్వరగా వికసించిన సందర్భంలో ఋతుకాలం సుదీర్ఘమవుతుంది. దీంతో అధిక కాలం ఆయా చెట్ల పుప్పొడి వల్ల ఉబ్బసం, ఇతరత్రా శ్వాస సమస్యలు తీవ్రతరమవుతాయి. ఈ మేరకు మేరీల్యాండ్‌లోని మొక్కలు చాలా త్వరగా వికసించిన సంవత్సరాల్లో ఆస్తమా పేషెంట్ల సంఖ్య పెరగడం సహా ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 17 శాతం పెరిగినట్లు గత అధ్యయనాలు వెల్లడించాయి.

పట్టణ మొక్కల ఫినాలజీ అనేది కార్బన్ డయాక్సైడ్, తేమ వంటి ఇతర కారకాలకు కూడా ప్రభావితమవుతుంది. మొత్తానికి మొక్కలు, కృత్రిమ కాంతి, ఉష్ణోగ్రత మధ్య ఈ పరస్పర చర్యలను అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. ఏదేమైనా 2012-2016 నుంచి ప్రపంచవ్యాప్తంగా రాత్రిపూట పట్టణ కాంతి ఏటా 1.8 శాతం పెరిగిందని ఒక అధ్యయనం కనుగొంది.

Tags:    

Similar News