పెట్రోల్ ధరల్లో సెకండ్ తెలంగాణ.. టాప్‌లో ఏపీ

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది నవంబరులో - Central Petroleum Department Analytical Statistics on Petrol and Diesel Consumption

Update: 2022-03-29 17:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది నవంబరులో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఆపేసిన చమురు కంపెనీలు మళ్లీ వారం రోజులుగా ప్రతీరోజు పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 22వ తేదీ తో మొదలైన ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. వారం రోజుల వ్యవధిలో పెట్రోలుపై రూ. 4.80 పైసలు పెరిగింది. డీజిల్ మీద సైతం అంతే స్థాయిలో పెరిగింది. పెట్రోల్ ధర మంగళవారం నాటికి రూ. 113 దాటగా డీజిల్ ధర రూ. 100 దాటేసింది. దేశం మొత్తం మీద అత్యధికంగా వ్యాట్ (రాష్ట్ర పన్ను) వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ థర్డ్ ప్లేస్‌‌లో ఉండగా దక్షిణాదిన సెకండ్ ప్లేస్‌లో ఉన్నది. ఒక్కో లీటరు పెట్రోలు పైన 35.2% (బేస్ ప్రైస్ మీద) చొప్పున వ్యాట్ రూపంలో తెలంగాణ వసూలు చేస్తుండగా డీజిల్ మీద 27% వసూలు చేస్తున్నది. సగటున ఏటా సుమారు 62 లక్షల టన్నుల మేర పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ విశ్లేషణ సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వికేంద్రీకరించిన తర్వాత 2017 నుంచి క్రమంగా చిల్లర ధరలు పెరుగుతూ ఉన్నాయి. బేస్ ప్రైస్‌తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సయిజ్, అదనపు ఎక్సయిజ్, వివిధ రకాల సెస్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ లాంటి వాటితో కలిపి వినియోగదారులపై భారీ స్థాయిలో భారం పడుతున్నది. కరోనా కారణంగా పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ పన్నును కొంత తగ్గించినా సెస్‌ల భారం మాత్రం తప్పలేదు. కానీ రాష్ట్రాల్లో మాత్రం వ్యాట్ తగ్గింపు లేకపోవడంతో ఈ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపైనా పడింది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి 21వ తేదీ వరకు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. కానీ వారం రోజులుగా సగటున ప్రతీరోజు పెట్రోలుపైన 80 పైసల వంతున పెంచుతూనే ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ వింగ్ లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధికంగా వ్యాట్ పేరుతో లీటరు పెట్రోలుపైన 35.2% చొప్పున వ్యాట్‌ను తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 31%గానే ఉన్నప్పటికీ ప్రతీ లీటరు మీద అదనంగా రూ. 4, రోడ్ డెవలప్‌‌మెంట్ సెస్ పేరుతో మరో రూపాయి అదనంగా వసూలు చేస్తున్నది. మహారాష్ట్రలో 26% వ్యాట్‌తో పాటు ప్రతీ లీటరు పెట్రోలు మీద రూ. 10.12 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్టాటిస్టికా అనే సంస్థ విశ్లేషణ చేసింది. ఆ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ వంద రూపాయల్లో రూ. 52.5% కేంద్ర, రాష్ట్ర పన్నుల రూపంలోనే వినియోగదారులు చెల్లిస్తున్నారని తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో రూ. 52.4 ఆంధ్రప్రదేశ్‌లో, రూ. 51.6 తెలంగాణలో ప్రతీ వంద రూపాయలకు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించాల్సి వస్తున్నదని పేర్కొన్నది.

తెలంగాణ వ్యాట్ ప్రకారం చూస్తే మంగళవారం నాటికి హైదరాబాద్‌లో ఒక లీటరు పెట్రోలు చిల్లర ధర రూ. 113 గా ఉన్నది. దులో 35.2% (రూ. 39.77) వ్యాట్ రూపంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. డీజిల్ ధర కూడా వంద రూపాయలు దాటడంతో అందులో రూ. 27 వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు పోతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ లీటర్ మీద ఎక్సైజ్ పన్ను రూపంలో పెట్రోల్ మీద రూ. 27.90 చొప్పున, అదనంగా సెస్‌ల రూపంలో వసూలు చేస్తున్నది. లక్షద్వీప్, అండమాన్, డయ్యూ డామన్ లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కనిష్ట స్థాయిలో (అక్కడ వ్యాట్ లేదు) రూ. 40 కంటే తక్కువగానే పన్ను వ్యవస్థ అమలవుతున్నది. ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో సైతం ప్రతీ వంద రూపాయల్లో గరిష్ట,గా రూ. 45 లోపే పన్నుల రూపంలో వినియోగదారులు చెల్లిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్, మద్యం విక్రయాల ద్వారానే వ్యాట్ రూపంలో గణనీయంగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. ఖజానాకు ఆదాయం కూడా భారీ స్థాయిలోనే సమకూరుతున్నది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన కొద్దీ వ్యాట్ రూపంలో రాష్ట్రానికి ఆదాయం అందుతూ ఉన్నది. కరోనా సమయంలో ఎక్సయిజ్ పన్నును కేంద్రం కొంత తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యధావిధిగా కొనసాగిస్తూ ఉన్నది.

Tags:    

Similar News