భద్రాద్రిపై 'బీజేపీ' అగ్ర నేతల కన్ను.. టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టే ప్లాన్
దిశ, భద్రాచలం : దక్షిణ అయోధ్య భద్రాద్రి పై బీజేపీ నేతల కన్ను పడిందా..?! సుందర భద్రాద్రి టీఆర్ఎస్ latest telugu news..
దిశ, భద్రాచలం : దక్షిణ అయోధ్య భద్రాద్రి పై బీజేపీ నేతల కన్ను పడిందా..?! సుందర భద్రాద్రి టీఆర్ఎస్ వందకోట్ల వైఫల్యం ను తమకు అనుకూలంగా మార్చుకునే స్కెచ్ బీజేపీ వేసిందా..?! అందులో భాగంగానే బీజేపీ అగ్రనేత అమిత్ షా భద్రాద్రి రాముని కళ్యాణంకు పయనం కడుతున్నారా..?! అదే జరిగితే గులాబీ బాస్ సంధించే "అస్త్రం "ఏమిటి..? కాషాయం, గులాబీ సెంటిమెంట్ భద్రాద్రికి మేలు చేయనుందా..?! ఇవీ.. తాజాగా రామ భక్తుల్లో వెల్లువెత్తుతున్న సందేహాలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం..
భద్రాద్రి పై 'భాజపా' అగ్రనేతలు కన్ను.. భద్రాచలం పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామ క్షేత్రం. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. ఈ పుణ్యక్షేత్రం ప్రగతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలోనే పూనుకుంది. రూ.100 కోట్ల నిధులతో భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని 2015లో శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. సుందర భద్రాద్రి నమూనాలు కూడా వడి వడిగా రూపొందుకున్నాయి.
ఆ తర్వాత ఏమయిందో కానీ.. భద్రాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలు పై టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేసింది. గత ఆరేళ్లుగా రూ.100 కోట్ల అభివృద్ధి నిధుల కేటాయింపు జరగని అంశంపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద లొల్లి చేస్తూనే వస్తున్నాయి. అయినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహిస్తూనే వస్తుంది. యాదాద్రి మీద దృష్టి సారించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. భద్రాద్రి ప్రగతి మాట.. ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ.. నోరు విప్పక పోవటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భద్రాచలంను చేర్చడం జరిగింది. రూ.92.04 కోట్ల నిధులను భద్రాచలం అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఈ నిధులతో భద్రాచలం, పర్ణశాల అభివృద్ధికి కేంద్రం పూనుకుంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం తో ఎంతో ఖ్యాతినార్జించిన బీజేపీ.. ఇదే సెంటిమెంట్‌ను భద్రాచలంపై కూడా చూపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రాచలం పర్యటన చేయనున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది.
ఏప్రిల్ 10న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరవుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. భద్రత నేపథ్యంలో ఈ విషయాన్ని గుట్టుగా దాచిపెట్టారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. ప్రసాద్ పథకంలో మంజూరైన నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా శంకుస్థాపన కూడా చేస్తారన్న ప్రచారం ఉంది.
బీజేపీ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగం
భద్రాచలం లో శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుక తరతరాలుగా జరుగుతోంది. ప్రభుత్వమే ఈ వేడుకలను జరిపిస్తుంది. శ్రీ సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి, శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ హాజరవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే గత సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రులు అందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. 2015లో తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు.
అనంతరం ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావడం లేదు. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఈసారి కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణంకు హాజరవుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఈ వేడుకకు హాజరు అవుతారా..? లేదా..? అన్నది.. అంతుచిక్కని విషయంగా మారింది.
కేంద్ర మంత్రి అమిత్ షా కావాలనే శ్రీరామనవమి వేడుకలకు హాజరై సెంటిమెంటును ప్రజల్లోకి పంపించి రానున్న ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేలా పెద్ద ఎత్తున వ్యూహరచన పన్నినట్లు తెలుస్తోంది.సెంటిమెంట్ గా భద్రాచలం నుంచే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమర శంఖారావం గావించనున్నట్లు ప్రచారంలో ఉంది. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ జరుగుతున్న పరిణామాలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. భద్రాచలం సెంటిమెంట్‌ని ఉపయోగించి టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టే మైండ్ గేమ్ ఆడుతున్న బీజేపీకి సీఎం కేసీఆర్ ఎలా చెక్ పెడతారో మిస్టరీగా మారింది.