Andhra Pradesh cabinet : రేపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం.. సీల్డ్ కవర్‌లో కొత్త మంత్రుల జాబితా!

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌‌లో ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2022-04-10 02:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌‌లో ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రుల రాజీనామా అనంతరం సీఎం జగన్ కేబినెట్ కూర్పు, ఈక్వేషన్స్‌పై కసరత్తు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్ పలు దఫాలుగా చర్చిస్తున్నారు. ఎంతమందిని కొనసాగించాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశంపై పదేపదే చర్చించారు. అయితే అనుభవం, సామాజిక సమీకరణాలు, సార్టీకి విధేయత ఆధారంగా మంత్రివర్గ కూర్పు సాగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు కూర్పు ఓ కొలిక్కి వచ్చిందని ఆదివారం మధ్యాహ్నాం 12 గంటలకు తుది నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. జీఏడీ ద్వారా సీల్డ్ కవర్‌లో కొత్త మంత్రుల జాబితాను, కొనసాగే వారి జాబితాను గవర్నర్‌కు అందజేస్తారని తెలియనుంది. అదే సమయంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారికి ఫోన్లు సైతం వెళ్లనున్నట్లు వైసీపీ కార్యాలయవర్గాల వెల్లడించాయి. ఇకపోతే నూతన మంత్రులు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మహిళలు, బీసీలకు ప్రాధాన్యత : సజ్జల రామకృష్ణారెడ్డి

కొత్త కేబినెట్‍పై కసరత్తు కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నాం వరకు కసరత్తు ఉంటుంది. అన్ని కాంబినేషన్స్‌ను సీఎం వర్కవుట్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. లిస్ట్ ఫైనల్ అయ్యాక కాబోయే మంత్రులకు రేపు ఫోన్లు చేస్తారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదు. బీసీలకు ప్రాధాన్యత ఉండేలా నిర్ణయం. ఆదివారం మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల జాబితా విడుదల అవుతుంది అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గం కూర్పుపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించారు. సుమారు మూడు గంటలపాటు చర్చించారు. ఆదివారం కూడా మరోసారి సీఎం జగన్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు. ఈసారి కేబినెట్ విస్తరణలో మహిళలకు సముచిత స్థానం ఉంటుందని.. పాత, కొత్త కలయికతో కేబినెట్ రూపుదిద్దుకోబోతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

నేడు గవర్నర్ వద్దకు మంత్రుల జాబితా

ఇకపోతే మంత్రుల రాజీనామాలు ఆదివారం ఉదయం గవర్నర్ కార్యాలయానికి జీఏడీ అధికారులు అందజేయనున్నారు. ఈ రాజీనామాలను గవర్నర్ బీబీ హరిచందన్ వెంటనే ఆమోదిస్తారని తెలుస్తోంది. అయితే సాయంత్రం కొత్తమంత్రులు, కొనసాగే మంత్రుల జాబితాను సీల్డ్ కవర్‌లో గవర్నర్‌ బీబీ హరిచందన్‌కు జీఏడీ అధికారులు అందజేస్తారని తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి మరోసారి ఆహ్వానం పలుకుతారని తెలుస్తోంది. వీటికి గవర్నర్ ఆమోదముద్ర వేయనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

నాడు విజయసాయిరెడ్డి నేడు సజ్జల రామకృష్ణారెడ్డి

ఇకపోతే ఆదివారం మధ్యాహ్నం నాటికి మంత్రివర్గం కూర్పు పూర్తి అవుతుందని తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కల్పించే వారి పేర్లు దాదాపు ఖరారు అవుతాయని సమాచారం. అనంతరం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి నేరుగా ఆదివారం మధ్యాహ్నాం 2గంటల తర్వాత ఫోన్ ద్వారా సమాచారం అందించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇకపోతే వైఎస్ జగన్ తొలి కేబినెట్ కూర్పు విషయంలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చక్రం తిప్పారు. నాడు జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారికి విజయసాయిరెడ్డి నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మెుత్తం కేబినెట్ కూర్పులో సీఎంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈసారి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయిన వారికి సజ్జల నేరుగా ఫోన్ చేస్తారని తెలుస్తోంది.

10మంది కొనసాగింపు?

ఇకపోతే గత కేబినెట్‌లో పనిచేసిన 10 మందిని మంత్రులుగా కొనసాగిస్తారని తెలుస్తోంది. వీరంతా సోమవారం మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మరోసారి కేబినెట్‌లో చోటు దక్కించుకునే వారిలో బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, పేర్నినాని, వేణుగోపాల కృష్ణ, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఉన్నారని తెలుస్తోంది. అయితే సీఎం జగన్ ఈక్వేషన్స్ ప్రకారం ఈసారి కేబినెట్‌లో బీసీ-9, ఎస్సీ సామాజిక వర్గం-6, ఎస్టీ-2, మైనారిటీ-1, రెడ్డి-3, కమ్మ-1, ఇతరులు-3 చోటు కల్పించాలని సీఎం జగన్ భావించారు. ఈ ఈక్వేషన్స్‌ఏ మాత్రం మార్చకుండా మంత్రివర్గం కూర్పు జరగనుందని తెలుస్తోంది. తొలుత కొత్త జిల్లాల ప్రకారం ప్రతీ జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించాలని సీఎం భావించారని అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో కొన్ని జిల్లాల నుంచి ప్రాతినిథ్యం ఉండదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధృవీకరించారు కూడా.

జగనన్న సైనికుడిలా పని చేస్తా : కోరుముట్ల శ్రీనివాసులు

'మంత్రి పదవులపై నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదేనని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎటువంటి పని చెప్పినా చేయడానికి నేను సిద్ధం. ప్రభుత్వంలోకి తీసుకుంటారా.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్. జగన్ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం. సీఎం ఆదేశించగానే 24 మంది మంత్రుల రాజీనామా చేశారు. అది మా కమిట్మెంట్‌. నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది 11న తెలుస్తుంది. నాకు ఏ బాధ్యత అప్పజెప్పినా జగనన్న సైనికుడిలా పనిచేస్తాను' అని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు.

మంత్రి పదవి కంటే పార్టీయే ముఖ్యం : బాలినేని శ్రీనివాసరెడ్డి

వైఎస్ఆర్ మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవికి రాజీనామా చేశాను. నాకు మంత్రి పదవులు అవసరం లేదు. పార్టీ అభివృద్ధే ముఖ్యం. నాడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తాది అని తెలిసి కూడా మంత్రి పదవిని వదులుకుని వైఎస్ జగన్ వెంట నడిచాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వీరాభిమానిని నేను. కేబినెట్ మెుత్తాన్ని రద్దు చేస్తానని సీఎం జగన్ నాతో అన్నారు. అందుకు సరే అన్నాను. నాకు పార్టీ ముఖ్యం తప్ప మంత్రి పదవి కాదని...జగన్ ఏ పదవి ఇచ్చినా చేసేందుకు మరింత బాధ్యతతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

సీఎం జగన్‌పై విశ్వాసం ఉంది : సీదిరి అప్పలరాజు

రాజీనామాల తర్వాత అసంతృప్తి రావడం సహజం..కానీ మాపార్టీలో అలా జరగలేదు. మంత్రులమంతా సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయాన్ని గౌరవించి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశాం. కానీ దీనిపై కూడా కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. కేబినెట్ కూర్పుపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రికే ఉంటుంది. ముఖ్యమంత్రి నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో సీఎం జగన్ పనితీరుని చూసే ప్రజలు ఓట్లేశారు. మమ్మల్ని చూసి కాదు. మా అందరికీ ముఖ్యమంత్రి జగన్‌పై అపార నమ్మకం, అచంఛల విశ్వాసం ఉంది. బలహీనవర్గాలలో ఇంతమందికి గతంలో ఎవరూ అవకాశం‌ కల్పించలేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా గొప్ప అవకాశం కల్పించారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సంతోషంగా పాటిస్తాం'అని మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.

ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తాం : చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

మంత్రులంతా అసంతృప్తితోనే రాజీనామా చేశారని... కొందరు సీనియర్లు అలిగారంటూ వస్తున్న వార్తలపై రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. కేబినెట్‌ అంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసిందని... అసంతృప్తి అనేది కేవలం మీడియా సృష్టేనని చెప్పుకొచ్చారు. మరోవైపు కేబినెట్‌లో మంత్రులకి స్వేచ్చ లేదనే ప్రచారం జరుగుతుందని అది పూర్తిగా అసత్యమని వివరణ ఇచ్చారు. తమకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు కాబట్టే సమర్థవంతంగా పనిచేయగలిగాం. కేబినెట్‌లో అన్ని వర్గాలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. జగన్ కేబినెట్‌లో పని చేయడం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు. కేబినెట్‌ కూర్పు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి‌ వైఎస్ జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తొలి కేబినెట్ కూర్పు తరహాలోనే.. ఈసారి కూడా అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నట్లు మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రాజ్యసభ అవకాశం రావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన‌ తనకు మంత్రి బాధ్యతలు అప్పటించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా మరింత బాధ్యతగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News