100 ఏళ్ల నుండి పిలుస్తున్న 'మాచు పిచ్చు' పేరు త‌ప్పంట‌..! కొత్త‌పేరు ఇదే..?!

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిచెందిన‌ పురావస్తు ప్రదేశాల్లో ఒకటిది. New Study Says 'Machu Picchu' is wrong It's Huayana.

Update: 2022-04-04 08:22 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు 'మాచు పిచ్చు'. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిచెందిన‌ పురావస్తు ప్రదేశాల్లో ఒకటిది. గ‌త 100 సంవత్సరాలుగా ఈ ప్ర‌దేశాన్ని 'మాచు పిచ్చు'గానే అంద‌రూ పిలుచుకుంటున్నారు. ఇన్కా సామ్రాజ్యపు ఈ చిహ్నం దక్షిణ అమెరికాలోని పెరూలోని ఆండియన్ అడవిలో ఉంది. ఇది 15వ శతాబ్దంలో నిర్మించ‌బ‌డింద‌ని చ‌రిత్ర‌కారుల అభిప్రాయం. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ అంద‌రూ పిలిచే ఈ పేరు తప్పు అని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. ఇటీవల ప్రచురించిన అధ్యయనంలో 'ఇన్కా'న్లు ఈ నగరాన్ని 'హుయానా పిచ్చు' అని పిలిచేవార‌ని పేర్కొంది. ఈ కథపై ఒక నివేదికను డొనాటో అమాడో గొంజాలెస్, బ్రియాన్ ఎస్ బాయర్ రాశారు. దీన్ని 'ఇన్‌వాపా పచా: జర్నల్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆండియన్ స్టడీస్‌'లో ప్రచురించారు. పెరూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో గొంజాలెస్ చ‌రిత్రకారుడిగా పనిచేస్తుండ‌గా, బ్రియాన్ బాయర్ చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని ఆంత్రోపాలజీ విభాగంతో క‌లిసి ప‌నిచేస్తున్నారు.

స‌ద‌ర‌న్ ఉటా యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ అయిన ఎమిలీ డీన్ ఈ కొత్త పేరుకు అర్థం చెబుతూ, 'హుయానా' అంటే "కొత్త లేదా యవ్వనం" అని, 'పిచ్చు' అంటే స్థానిక క్వెచువా భాషలో "పర్వత శిఖరం" అని అర్థమ‌ని అన్నారు. ఇక‌, 'మాచు' అంటే 'పాతది' అని అర్థం. కాబట్టి మేము దీనిని పాత పర్వత శిఖరం అని పిలుస్తున్నాము' అన్నారు. అయితే, 'మచు పిచ్చు' అనేది తప్పు పేరు అని నిర్ధారణకు రావడానికి పరిశోధకులు మూడు మూలాధారాలను పరిశీలించారు. బింగ్‌హామ్ ఫీల్డ్ నోట్స్, ఈ ప్రాంతానికి వ‌చ్చిన సందర్శకుల ప‌త్రాలు, అలాగే, వలసరాజ్యాల కాలం నాటి పత్రాలు. వాస్త‌వానికి, స్థానిక గైడ్ మెల్చోర్ ఆర్టీగా అనే రైతు అందించిన సమాచారం ఆధారంగా పురాతన నగరాన్ని 'మచు పిచ్చు' అని పిలవాలని బింగ్‌హామ్ అప్ప‌ట్లో నిర్ణయించినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇక‌, ఇటీవ‌ల బాయర్ తన పరిశోధనలో అస‌లు సెటిల్మెంట్ పేరు వేరేదని కనుగొన్నాడు. గొంజాల్స్ కూడా అదే విషయాన్ని కనుగొన్నాడు. కాబట్టి, వారు ఆ ప్రాంతానికి బింగ్‌హామ్ సందర్శనకు ముందు ముద్రించిన మ్యాప్‌లు, అట్లాస్‌లను సమీక్షించి, 'హూయానా పిచ్చు'నే నిజ‌మైన పేరుగా ధృవీక‌రించారు. అయితే, వారు సైట్ పేరును మార్చడానికి ప్రతిపాదించ లేదు. ఎందుకంటే, 'మాచు పిచ్చు' ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

Tags:    

Similar News