ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం.. సీబీఐ విచారణ జరిపించాలి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2020లో సర్వేపల్లిలో పురుడుపోసుకున్న ధాన్యం కుంభకోణం నేడు వేల కోట్ల అక్రమాలతో రాష్ట్రమంతా విస్తరించిందని ఆరోపించారు. మూడేళ్ల జగన్ పాలనలో రైతుల్ని నిండా ముంచేశారని ఇన్ని పాపాలు చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన భారీ కుంభకోణాన్ని 63 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు(వీఏఏ)కి అంటగట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైపీపీ నేతలు, దళారులదేనని ఆరోపించారు. దీనిపై విచారణ జరిగితే పెద్ద తలకాయలు బయటపడతాయనే ఉద్దేశంతో ఆధారాలు వెలుగులోకి తెచ్చిన దళిత రైతు జైపాల్ పైనే రివర్స్ కేసు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర రూ.16660గా ఉంటే మూడేళ్లలో రైతులకు దక్కిన ధర కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా రూ.12 వేలు మాత్రమేనని తెలిపారు. దళారుల్లో మంత్రి మనుషులు కూడా ఉన్నారని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి జెడ్పీ సమావేశంలో చెప్పారని గుర్తుచేశారు. వైసీపీ నేతల దోపిడీపై ఆ పార్టీ ప్రభుత్వమే విచారణ చేస్తే న్యాయం జరగదని సీబీఐ విచారణ జరిగితేనే రైతులకు న్యాయం జరుగుతోందని సోమిరెడ్డి పేర్కొన్నారు.