ఇది సామాజిక క్యాబినెట్‌: సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వ తొలి క్యాబినెట్‌ ఒక సామాజిక విప్లవమనీ, పునర్‌ వ్యవస్థీకరణలోనూ..latest telugu news

Update: 2022-04-10 17:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వ తొలి క్యాబినెట్‌ ఒక సామాజిక విప్లవమనీ, పునర్‌ వ్యవస్థీకరణలోనూ మరో సామాజిక విప్లవానికి నాంది పలికామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామనీ, వారికే 70 శాతం పదవులు ఇచ్చినట్లు వివరించారు. ఈసారి మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పించామనీ, ఇది రాజ్యాధికారంలో ఒక కొత్త ఒరవడి అని అన్నారు. పాత మంత్రులు, కొత్త మంత్రులతో మంత్రివర్గం కూర్పు జరిగిందన్నారు. కొత్త మంత్రివర్గంపై అంతటా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయనీ, ఎక్కడా అసంతృప్తి లేదని సజ్జల స్పష్టం చేశారు. ఒకవేళ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన, నాయకులే సర్ది చెప్తారన్నారు.

చంద్రబాబు హయాంలో ఎస్టీ, మైనార్టీలకు చోటే లేదు..

చంద్రబాబు తొలి క్యాబినేట్‌లో ఎస్టీ, మైనార్టీలకు చోటే లేదనీ, ప్రభుత్వం దిగిపోయే నాలుగు నెలల ముందు మాత్రమే వారికి పదవులు ఇచ్చారని సజ్జల గుర్తు చేశారు. బీసీలు తమతో ఉన్నారని చెప్పే చంద్రబాబు.. వారికి ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. చిత్తశుద్ధితో జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారన్నారు. అణగారిన వర్గాలకు సాధికారత తీసుకురావటం చంద్రబాబు ఇష్టం లేదన్నారు. దివాళా తీసిన టీడీపీ ఎక్కడ ఏ అలజడి రేగుతుందోనని చూస్తోందని, మంత్రివర్గ మార్పులో అసంతృప్తి రగులుతుందని ఆశలు పెట్టుకున్నారనీ.. అలా ఏమీ జరగలేదని సజ్జల అన్నారు.

రాగ ద్వేషాలకు అతీతంగా

రాగ ద్వేషాలకు అతీతంగా నూతన కేబినేట్‌ గురించి కసరత్తులు చేశామన్నారు. వెనకబడిన వారికి ప్రాధాన్యత పెంచటం, ప్రాంతాల వారీగా సమతుల్యత పెంచటంపై దృష్టి పెట్టామన్నారు. కొన్ని సామాజిక వర్గాల నాయకులకు అవకాశం కల్పించే ప్రక్రియలో, కొన్ని వర్గాల నేతలు ఇప్పుడు పదవులు దక్కలేదని.. అంతే తప్ప ఎవరిని నిర్లక్ష్యం చేయలేదని సజ్జల స్పష్టం చేశారు.

Tags:    

Similar News