ఎటుచూసినా మాంసం ముద్దలు.. చెల్లా చెదురుగా మృతదేహాలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చుట్టూ దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలు, మాంసం ముద్దలుగా..11 charred to death in massive fire in timber godown in Secunderabad

Update: 2022-03-23 06:53 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చుట్టూ దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలు, మాంసం ముద్దలుగా 11 మంది బీహార్ కు చెందిన కార్మికుల మృతదేహాలు, ఎటుచూసినా హాహా కారాలు.. ఇవి బుధవారం తెల్లవారుజామున బోయిగూడ స్క్రాప్ గోదాం నెలకొన్న దృశ్యాలు. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. గంటల అనంతరం మంటలు అదుపులోకి రాగా లోపల భీతావహ పరిస్థితి నెలకొంది. కనీసం ఎవరి మృతదేహాలు ఎవరివో చెప్పలేని విధంగా కాలిపోయారు. దీంతో మృతులను గుర్తించేందుకు గాంధీ వైద్యులకు డీఎన్ ఏ పరీక్షలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో గోదాం లోపల ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసి వీలుకాకపోవడంతో ఆ మంటలలోనే కాలిపోయారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో కార్మికులంతా నిద్రపోతున్నారని తెలిసింది. అయితే మంటల దాటికి నిద్ర లేచినప్పటికీ తప్పించుకునే మార్గం లేక అగ్నికి ఆహుతయ్యారు. ఓ వైపు మంటలు ఎగిసి పడుతుండగా మరోవైపు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసినట్లుగా అక్కడక్కడ పడి ఉన్న మృతదేహాలను బట్టి తెలిసింది. అయితే కిటికీ నుండి బయటకు దుంకిన ప్రేమ్ అనే కార్మికుడు ప్రాణాలతో బయట పడ్డాడు. స్క్రాప్ గోదాంను అనుసరించి ఉన్న వెల్డింగ్ షాప్, కేబులో గోదాంలకు మంటలు వ్యాప్తి చెందాయి.

ఈ సంఘటనలో కేబుల్ గోదాంలో ఉన్న కేబుల్స్ కు మంటలు అంటుకుని పూర్తిగా దహనమైంది. మొత్తం మీద ఇక్కడి పరిస్థితి సినిమాలోని దృశ్యాలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తుండగా సిలిండర్ పేలుడు కూడా జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని అక్కడున్నవారు వ్యక్తం చేశారు. మృతులలో 9 మంది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా మాడిపోయాయి. దీంతో అన్ని మృతదేహాలకు డీఎన్ ఏ పరీక్షలు చేయకతప్పని పరిస్థితి నెలకొందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద సంఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పది రోజులలో ఇంటికి వస్తామని....

అగ్ని ప్రమాద మృతులంతా బీహార్ రాష్ట్రంలోని జిల్లా ఛాప్రాకు చెందినవారు. సుమారు రెండేళ్లుగా వీరు ప్రమాదం జరిగిన గోదాంలో పని చేస్తున్నారు. వీరిలో కొంతమందికి వివాహం కాగా పెండ్లి కాని వారు కూడా ఉన్నారు. అయితే వీరందరిని గుర్తించాల్సి ఉంది. వీరంతా నెలకు రూ. 12 వేల జీతానికి పని చేస్తున్నారు. వీరిలో కొంతమంది మరో పది రోజులలో ఇంటికి వస్తామని కుటుంబ సభ్యులతో చెప్పగా ఇంతలో దారుణం జరిగిపోయింది.

ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే...

బోయిగూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న శ్రవణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోదాం యజమాని సంపత్ గా అధికారులు గుర్తించారు . గోదాం విస్తీర్ణం సుమారు వెయ్యి గజాలలో ఉన్నప్పటికీ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒక్కటే ప్రవేశం ఉంది. తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రవేశ ద్వారం వద్దనే మంటలు మొదలు కావడంతో తప్పించుకునే మార్గం లేక వారు బలైపోయారు. గోదాం లోపలి భాగంలో పెద్ద ఎత్తున సీసాలు, ఇతర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. మంటల దాటికి సీసాలు పగిలిపోయి చెల్లా చెదురుగా లేనికి వెళ్లలేని విధంగా పడిపోయాయి.

నిబంధనలకు నీళ్లు..

అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న షెడ్డుకు ఫైర్ విభాగం నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. దీనికి తోడు లోపలి భాగంలో ఎలాంటి అగ్ని ప్రమాద రక్షణ చర్యలు లేవు. జీహెచ్ఎంసీ, కార్మిక విభాగాల నుండి కూడా ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. అయితే గాంధీ నగర్ పోలీసులు గోదాం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎక్స్ గ్రేషియా..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. అంతేకాకుండా మృతదేహాలను వారి సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. గోదాంకు ఉన్న అనుమతులను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Tags:    

Similar News