బీఆర్ఎస్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. కంట్రోల్ చేయలేక అభ్యర్థుల్లో ఆందోళన!
అధికార పార్టీపై జనాల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు మంత్రులను సైతం ప్రజలు నిలదీస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీపై జనాల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు మంత్రులను సైతం ప్రజలు నిలదీస్తున్నారు. గులాబీ బాస్ ప్రజా ఆశీర్వాద సభలు పూర్తయినా నిరసనలు, నిలదీతలు ఆగడం లేదు. ఆసరా, రేషన్ కార్డులు, దళితబంధు.. ఇలాంటి అనేక పథకాలలోని లోపాలు, జాప్యం అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వీఆర్వోలు, కౌలు రైతులు, ధరణి బాధితులు, హోంగార్డులు, పోలీసుల్లో కొందరు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారనేది ఆ పార్టీ నేతల్లో ఒక సాధారణ అభిప్రాయంగానే ఉన్నది. ఈ సెక్షన్ ప్రజల ఓట్లు తమకు దూరమై.. ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారుతాయనే గుబులు గులాబీ నేతలను వెంటాడుతున్నది. అన్ని పార్టీకన్నా ముందే సెప్టెంబరులోనే ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలుపెట్టింది. దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని కంట్రోల్ చేయలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్నదని ప్రజల్లో పెరుగుతున్న ఓపెన్ టాక్‌ను సైతం కట్టడి చేయలేకపోయామనే బీఆర్ఎస్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
రైతులు, ఉద్యోగులు..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తున్నామని, ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతగా వేతనాలు లేవని, పీఆర్సీ ఫిట్‌మెంట్ కూడా గణనీయంగా పెంచామని అధికార పార్టీ చెప్పుకుంటున్నా ఆ సెక్షన్ల నుంచి ఆశించినంత ఆదరణ లభించడం లేదు. సకాలంలో జీతాలు రాకపోవడం, దీనికితోడు లోన్లు, ఈఎంఐల చిక్కులు, దీర్ఘకాలంగా డీఏలు పెండింగ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులు లేకపోవడం, అలవెన్సులు ఆగిపోవడం వంటివన్నీ ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో 317, బదిలీలు, పదోన్నతులు, స్పౌజ్ ట్రాన్సఫర్లు, ఖాళీ పోస్టుల భర్తీలో జాప్యం తదితరాలతో ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొన్నది. నోటిఫికేషన్లు ఇచ్చినా ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు తదితరాలతో విద్యార్థులు, నిరుద్యోగులు, యువతలో వ్యతిరేకత భారీగా ఉన్నది. ధరణి వ్యవస్థను అధికార పార్టీ గొప్పగా చెప్పుకుంటున్నా దానితో సమస్యలు ఎదుర్కొంటున్న వారు, కౌలు రైతుల నుంచి సైతం వ్యతిరేకత వస్తున్నది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పర్యటన తర్వాత కూడా ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తగ్గకపోవడం గమనార్హం.
కాంగ్రెస్‌కు మైనార్టీ మతస్తుల మద్దతు
రాష్ట్రంలో మత ఘర్షణలకు తావులేదని, అందరూ సామరస్యంగా ఉన్నారని, అన్ని మతాలకు తగిన గౌరవం ఇస్తున్నామని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది. కానీ బీఆర్ఎస్ పదేండ్ల ఆచరణ, పాలన చూసిన తర్వాత క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ మత సంఘాలు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆ మతాలకు చెందిన జమాతె ఇస్లామీ హింద్, క్రిస్టియన్ సమాఖ్య తదితరాలు కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు పలికాయి. లౌకిక పార్టీగా బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా రెండు మతాలు పదేండ్లుగా సహకరించినా ఈసారి ప్రతికూలంగా ఉండనున్నట్టు నిర్ణయం తీసుకున్నాయి. సిరిసిల్లలో పద్మశాలి, పటాన్‌చెరులో ముదిరాజ్ తదితర పలు కుల సంఘాలు సైతం ఓపెన్‌గానే బీఆర్ఎస్‌కు వ్యతిరేక వైఖరి తీసుకున్నాయి.
స్థానిక ప్రజాప్రతినిధుల్లోనూ అసంతృప్తి
వివిధ స్థాయిల్లో ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానిక సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తుందని హామీ ఇచ్చినా అది అమలుకాలేదు. పల్లె ప్రగతిలో సొంతంగా ఖర్చుపెట్టి పనులు చేసినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకోవడం, పంచాయతీరాజ్ ఉద్యోగులకు దీర్ఘకాలంగా జీతాల్లేకపోవడం.. వంటివి కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారడానికి దారితీశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే స్థానిక ప్రజాప్రతినిధులకు పీసీసీ చీఫ్ ఓపెన్ లెటర్ రాసి సహకారాన్ని కోరారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న కింది స్థాయి ఉద్యోగుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకతే ఉన్నది. కానీ దాన్ని బహిర్గతపర్చలేని పరిస్థితుల్లో ఓపెన్‌గా డిస్కస్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. వీఆర్వోల్లో సైతం ఇలాంటి వ్యతిరేక అభిప్రాయాలే ఉన్నాయి.
ప్రజలకు అందుబాటులో లేకపోవడం..
ఎమ్మెల్యేలు మొదలు సీఎం వరకు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అనూహ్యమైన సంపదను పోగేసుకోవడం వంటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు అందుకోవాలంటే ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వాల్సి రావడం, దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డులు రాకపోవడం, ధరణి సమస్యలకు పరిష్కారం లేకపోవడం, వివిధ స్థాయిల్లో లంచాలు ఇవ్వాల్సి రావడం, భూకబ్జా ఆరోపణలు.. ఇలాంటివన్నీ ప్రజల్లో అధికార పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకతకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజలను బీఆర్ఎస్ లీడర్లు పట్టించుకోవడంలేదనే అభిప్రాయం రూరల్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది.
పోల్ మేనేజ్‌మెంట్‌పైనా సందేహం
ప్రచారంలో కొలిక్కిరాని ఓటర్లను పోల్ మేనేజ్‌మెంట్ ద్వారా దారికి తెచ్చుకోవచ్చనే అభిప్రాయం అధికార పార్టీ అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నది. కానీ ఈసారి అది ఆ స్థాయి దాటిపోయిందనే గుబులు వారిని వెంటాడుతున్నది. ఒకవైపు పార్టీ, మరోవైపు అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతతో ఓటర్లు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, పోల్ మేనేజ్‌మెంట్‌తో కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదని, పరిస్థితి చేయి దాటిపోయిదని, ఓటింగ్ సమయంలో అనుకూలంగా మారుతుందనే ఆశలూ అధికార పార్టీ క్యాండిడేట్స్‌లో వ్యక్తం కావడంలేదు. పదేళ్లుగా అధికారంలో ఉన్నందున యాంటీ ఇన్‌కంబెన్సీ ఒక మేరకు ఉండడం సహజమే అయినా మార్పు దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారనేది ఈసారి క్షేత్రస్థాయిలో బలంగా కనిపిస్తున్నదని పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం. రెండు నెలలుగా కంట్రోల్ కాని వ్యతిరేకత.. రెండు రోజుల్లో అదుపులోకి వస్తుందనుకునే భ్రమలు సైతం లేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read More: నేటి నుంచి ఆంక్షలు.. సాయంత్రం ఐదు గంటలకు వైన్స్ బంద్