బీఆర్ఎస్‌కు ఈసీ ఝలక్.. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరుగనుంది?

బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊహించని షాక్ తగిలింది. రోడ్డు రోలర్, ట్రాక్టర్, ఆటోరిక్షా, సోప్ బాక్స్, డోలీ తదితర గుర్తుల్ని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని చేసిన రిక్వెస్టుకు చేదు అనుభవం ఎదురైంది.

Update: 2023-10-20 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊహించని షాక్ తగిలింది. రోడ్డు రోలర్, ట్రాక్టర్, ఆటోరిక్షా, సోప్ బాక్స్, డోలీ తదితర గుర్తుల్ని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని చేసిన రిక్వెస్టుకు చేదు అనుభవం ఎదురైంది. గత నెల 27న, ఈ నెల 3, 10 తేదీల్లో ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులను తిరస్కరించింది. గుర్తుల తొలగింపుపై గతంలోనే వివరాలతో కూడిన సమాధానం ఇచ్చామని, తెలంగాణ హైకోర్టు సైతం స్పష్టమైన తీర్పు వెలువరించిందని పేర్కొన్నది. తాజాగా మూడు విజ్ఞప్తు(ఫిర్యాదు)లను తిరస్కరిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ జయదే లాహిరి ఈ నెల 12న బీఆర్ఎస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో ఈనెల 17న దాఖలు చేసిన పిటిషన్‌ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు శుక్రవారం విచారణకు రానున్నది.

యుగతులసి పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో నిర్ణయం తీసుకున్నది. గతంలో ఈ గుర్తుతో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని బీఆర్‌ఎస్ ఈ నెల 27న ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. తమ పార్టీకి కామన్ సింబల్‌గా కారు గుర్తు ఉన్నదని, రోడ్డు రోలర్ సైతం కారును పోలి ఉన్నందున ఓటర్లు కన్‌ఫ్యూజన్‌కు గురవుతున్నారని తెలిపింది. ఫలితంగా తమ పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని, కొన్ని ఎన్నికల పోలింగ్‌లో జరిగిన గణాంకాలను పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వివరించారు. గతంలో సైతం ఇదే విజ్ఞప్త చేస్తే జాబితా నుంచి రోడ్డు రోలర్ సహా కొన్ని గుర్తుల్ని తొలగించిన అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పెట్టుకున్న మూడు విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకోలేమని ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ పేర్కొన్నారు. వాటిని తిరస్కరిస్తున్నట్లు తాజా లేఖ (నెం. 56/06/2023/పీపీఎస్-1/2805)లో బీఆర్ఎస్ అధ్యక్షుడికి వివరించారు.

సుప్రీంకోర్టులో పిటిషన్‌..

ఇదిలా ఉండగా గుర్తుల వివాదానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను తొలి విచారణ సందర్భంగానే ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ తరఫు లాయర్ మూడు రోజుల క్రితం (అక్టోబరు 17న) సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. ప్రతివాదులుగా కేంద్ర ఎలక్షన్ కమిషన్, యుగతులసి పార్టీలను బీఆర్ఎస్ పేర్కొన్నది.

Read More..

రండి.. మాట్లాడుదాం.. గజ్వేల్ నాయకులకు CM KCR స్పెషల్ ఇన్విటేషన్  

Tags:    

Similar News