తప్పకుండా శిక్ష పడుతుంది.. సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ లేఖ

బీఆర్ఎస్ సర్కార్‌కు నిరుద్యోగుల చేతిలో తప్పకుండా శిక్ష పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్షను మరోసారి నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు.

Update: 2023-09-23 15:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సర్కార్‌కు నిరుద్యోగుల చేతిలో తప్పకుండా శిక్ష పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్షను మరోసారి నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫలిమే ఈ దుస్థితికి కారణమని సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ రాశారు. ‘‘తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు విద్యార్థులు, యువత అలంబనగా నిలిచి.. ఆ ఉద్యమం చల్లారకుండా తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను సజీవంగా ఉండేలా చేశారు. 1952 ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం, 1969 మొదటి దశ ఉద్యమం నుంచి 2014 వరకు జరిగిన మలి దశ వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్ధులు కీలక పాత్ర పోషించారు.

అయితే, 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్థులకు అడుగడునా పరాభావం ఎదురవుతూనే ఉంది. ఇంటర్మీడియట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకు, అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మీ మోసం పరాకాష్టం చేరింది. ఇంత జరిగిన మీ ప్రభుత్వంలో చలనం లేదు. ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించిన పాపాన పోలేదు. నీళ్లు.. నిధులు.. నియామకాలు నినాదంతో తెలంగాణ యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన మీరు గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదు. సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది మంది యువత నిరాశ నిస్పృహలకులోనై ఆత్మహత్యలు చేసుకున్న కూడా పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరించారు.

మరోవైపు పేపర్ లీకేజీతో గతేడాది అక్టోబర్ 22న నిర్వహించిన గ్రూప్-1 (ప్రిలిమినరీ)కు పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో 2 లక్షల 80 వేల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా తయారైంది. ఇంత జరిగిన పేపర్ లీకేజీపై సరైన చర్యలు తీసుకోకుండా అందుకు కారణమైన వారిని శిక్షించకుండా ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్-1(ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. తప్పులు దిద్దుకొని గత అనుభవం నుంచి ఈ సారైనా పడక్బందీగా పరీక్ష నిర్వహిస్తారానుకుంటే.. మీ వక్రబుద్ధితో పరీక్ష నిర్వహణలో డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారు. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, హాల్ టికెట్ నెంబర్ తో ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం కనీస బాధ్యత. కానీ ఘనత వహించిన పాలనలో ఇవేమీ పట్టించుకోకుండా బయోమెట్రిక్ తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం వంటి దారుణమైన తప్పులకు పాల్పడ్డారు. ”దీంతో కోర్టు జోక్యం చేసుకోని రద్దు చేయాల్సి వచ్చిందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News