సంతోషం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా?
నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగనున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు విముక్తి కలగబోతోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన చీడ వీరగనున్నదన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగనున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు విముక్తి కలగబోతోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన చీడ వీరగనున్నదన్నారు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. రాబోయే విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందని రేవంత్ రెడ్డి హరీష్, కేటీఆర్‌లను ఉద్దేశించి విమర్శించారు. అందుకే స్థాయి లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈ ఇద్దరు నేతలు విమర్శిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారో? చర్చలో చెప్పండంటూ రేవంత్ స్పష్టం చేశారు.
లక్ష కోట్ల దోపిడీ
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నదని, పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ చలి జ్వరం వచ్చిందన్నారు. కేసీఆర్‌కు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు అయ్యారు తప్పా.. ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
సంపద పెంచాలి.. పేదలకు పంచాలి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందిస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి మహిళలను ఆదుకుంటామన్నారన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతీ రైతుకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా రూ.15వేలు అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమన్నారు.