YSRTP అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్

తెలంగాణలో మహిళ భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందని ట్యాంక్ బండ్ వద్ద మౌన దీక్షకు దిగిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-03-08 08:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహిళ భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందని ట్యాంక్ బండ్ వద్ద మౌన దీక్షకు దిగిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే మౌన దీక్షకు కూర్చున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన షర్మిల మహిళల భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ధ్వజమెత్తారు.

అత్యాచాలు, కిడ్నాప్‌లలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని, కేసీఆర్ పాలనలో మహిళలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయారన్నారు. ప్రతి యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఎంతో మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చిన్నదొర కేటీఆర్ నియోజవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే దిక్కులేదని ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తానన్న కేసీఅర్ ఇప్పటి వరకు ఎంత మంది గుడ్లు పీకారని ప్రశ్నించారు. స్వయంగా మంత్రుల బంధువులు రేప్ లు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్క కవితకు మాత్రమే రక్షణ ఉందని మిగతా మహిళలు అంటే కేసీఅర్ కు లెక్కే లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏకంగా గవర్నర్ మీదనే అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీగా మారిపోయిందన్నారు.

కవిత సిగ్గులేకండా లిక్కర్ వ్యాపారం చేసి ఆ స్కామ్ లో చిక్కుకుని మహిళల గౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్ లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదు కానీ మహిళా రిజర్వేషన్ కోసం కవిత ధర్నా అంటోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదని ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలు చేశారని ఆరోపించారు. మహిళ భద్రత కోసం భరోసా యాప్ తీసుకువచ్చామని కేటీఆర్ చెప్పారు. తాను ఫోన్ లో చెక్ చేస్తే ఎక్కడా ఆ యాప్ కనబడటం లేదు. కేసీఆర్, కేటీఆర్ కేవలం మాటలకే పరిమితం అయ్యారని, తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యిందన్నారు. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబు బ్లాస్ట్ అవుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.

Tags:    

Similar News