KCR తెలంగాణ బిడ్డే అయితే ఆ పని చేయాలి: YS షర్మిల సవాల్

ముఖ్యమంత్రి కేసీఆర్ పగటెచ్చుల దొర అని, విశాఖ ఉక్కు కొంటానని పదిమందిలో రాష్ట్రం పరువు తీశాడని షర్మిల ఘాటు విమర్శలు చేశారు.

Update: 2023-04-21 14:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పగటెచ్చుల దొర అని, విశాఖ ఉక్కు కొంటానని పదిమందిలో రాష్ట్రం పరువు తీశాడని షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అనే సామెత సీఎంకు సరిగ్గా సరిపోతుందని శుక్రవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ విషయంలో గొప్పలకు పోయి బొక్కబోర్లపడ్డాడని చురకలంటించారు. బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ అని అందరితో అనిపించుకున్నాడని సెటైర్లు వేశారు. అడ్డం, పొడుగు మాటలతో జనాలను ఫూల్స్ చేయడం దొరకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవాచేశారు.

కేసీఆర్ తెలంగాణ బిడ్డే అయితే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే.. గతంలో హామీ ఇచ్చినట్లుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, వంద రోజుల్లో నిజాం షుగర్స్ తెరిపిస్తానంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆమె సవాల్ విసిరారు. మూతపడిన వందలాది ఫ్యాక్టరీలను తెరిపించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, రోడ్డున పడిన లక్షలాది కార్మికులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ తన నీచ రాజకీయాల కోసం ప్రతిసారి రాష్ట్ర పరువును పణంగా పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని ఆమె హెచ్చరించారు.

నిరాహారదీక్షకు హైకోర్టు అనుమతి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం తలపెట్టిన ‘టీ సేవ్’ నిరాహార దీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీక్ష చేసే 48 గంటల ముందు పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించింది. దీక్షలో 500 మందికి మించకూడదని హైకోర్టు షరతు విధించింది. దీనిపై స్పందించిన షర్మిల నియంత కేసీఆర్ పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూసినా, ప్రశ్నించే వారిని బందీలు చేసినా.. న్యాయం బతికే ఉందనేందుకు ఇది నిదర్శమని పేర్కొన్నారు. తమ పోరాటాన్ని ఆపేది లేదని వెల్లడించారు.

Tags:    

Similar News