మీ ట్వీటే మీ కొంప ముంచింది కేటీఆర్!.. ఏపీ టీడీపీ నేత సోమిరెడ్డి కౌంటర్
ప్రజలు కాళ్ల కింద పడేసి తొక్కినా.. మీలో అహంకారం తగ్గకపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని టీడీపీ మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు కాళ్ల కింద పడేసి తొక్కినా.. మీలో అహంకారం తగ్గకపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని టీడీపీ మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ వైసీపీ ఓటమిపై పలు వ్యా్ఖ్యలు చేశారు. దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది అని, ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారని మండిపడ్డారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారని, అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారని అన్నారు.
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోవాలని కేటీఆర్ కు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాగా ఏపీ రాజకీయాలపై కేటీఆర్ మాట్లాడుతూ.. జగన్ ఓడించేందుకు ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిలను ప్రతిపక్షాలు పావులుగా వాడుకున్నారని, శర్మిల వల్ల వైసీపీకి కొంత డ్యామేజీ జరిగిందని తెలిపారు. ఐదేళ్లలో ప్రజలకు సంక్షేమం చేసిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, కేవలం 11 స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించినప్పటికీ.. 40 శాతం ఓటింగ్ పర్సంటేజ్ సాధించడం గొప్ప విషయమన్నారు. నిత్యం ప్రజల్లో తిరిగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోడం కూడా తనను షాక్‌కి గురి చేసిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే.. ఏపీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు.