రాష్ట్రానికి ‘కొడంగల్’ నాయకత్వం వహించేనా? హాట్ హాట్‌గా చర్చ!
కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలనాత్మకమైన అసెంబ్లీ అని చెప్పవచ్చు.
దిశ, కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలనాత్మకమైన అసెంబ్లీ అని చెప్పవచ్చు. ఒక్కసారి కొడంగల్ భౌగోళిక స్వరూపం చూస్తే మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలో మరో రెండు మండలాలు నారాయణపేట జిల్లాలో ఉన్న రెండు జిల్లాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు జిల్లాలే అని చెప్పవచ్చు. అయితే ఎన్నికలు ఏవైనా ఇక్కడి ప్రజల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంటుం ది. అది ఎలా అంటే ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థులను కూడా అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఇక్కడి ప్రజలకు సొంతమని చెప్పవచ్చు.
కానీ ఇంత రాజకీయ చరిత్ర ఉన్న రాజకీయ ఉద్దండులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినా ఇప్పటి వరకు ఎలాంటి రాష్ట్ర స్థాయి పదవితో పాటు మంత్రి పదవి కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎవరికి రాలేదు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో గురునాథ్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్న కొడంగల్‌లో యువకుడు అని రేవంత్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇవ్వడంతో మంత్రి పదవి అనేది కొడంగల్ నియోజకవర్గానికి అందని ద్రాక్షగానే ఉండిపోయింది.
అయితే తాజా రాజకీయాలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా తయారవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులకే నమ్మకం లేకపోయినా కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ మాదిరిగా పార్టీ పగ్గాలు చేపట్టిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసిన అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడంలో సఫలీకృతుడయ్యాడు. మరి ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డికి సీఎం పదవీ దక్కేనా అని చర్చ నడుస్తున్నది. మరి అదే జరిగితే మారుమూల అసెంబ్లీ నియోజకవర్గం అయిన కొడంగల్ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం రావడం ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి చక్కటి అవకాశం వస్తుందని ఇక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.