MLC Kavitha: టోపీలు పెట్టుకొని ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ నైజం: కవిత
మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మైనారిటీలపై కాంగ్రెస్ (Congress) కపట ప్రేమ చూపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) విమర్శించారు. ఈ మేరకు ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని కోట్లాది మంది హక్కులను కాలరాసే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై (Waqf Amendment Bill) చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్.. మైనారిటీల హక్కులను కాలరాసే వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మైనారిటీలకు అండగా ఉండాల్సిన సమయంలో రాహుల్ వెన్ను చూపించారని ధ్వజమెత్తారు. ఈ బిల్లు సమయంలో ప్రియాంకాగాంధీ పార్లమెంట్‌కు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. కేవలం ఎన్నికల సమయంలోనే వీళ్లకు మైనారిటీలు గుర్తొస్తారా? అని నిలదీశారు. టోపీలు పెట్టుకొని ఓట్లు దండుకోవడమే వీళ్ల నైజం అంటూ దుయ్యబట్టారు.