కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ.. మాజీ మంత్రి మల్లారెడ్డి దారెటు?

మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పు అంశం ఆసక్తిగా మారింది.

Update: 2024-06-23 13:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చేరికల పర్వం హాట్ హాట్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల జంపింగ్ ల వ్యవహారం చర్చనీయాశం అవుతున్నది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరడంతో అదే బాటలో నడిచే మరికొంత మంది గులాబీ ఎమ్మెల్యేలు ఎవరూ అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ బ్లాస్టింగ్ గా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో దానం మాట్లాడుతూ.. దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఏకంగా వారి పేర్లను కూడా బయటపెడ్డటం సంచలనానికి దారి తీశాయి. దానం వ్యాఖ్యలపై పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది అసాధ్యమేమి కాకపోవచ్చనే చర్చ తెరపైకి వస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరి విషయం ఎలా ఉన్నా మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు హైలెట్ అవుతోంది.

అటు వైపా ఇటు వైపా?:

మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొంత కాలంగా పార్టీ మారుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గతంలో ఆయన డీకే శివకుమార్ తోనూ భేటీ అయ్యారు. దాంతో ఆయన పార్టీ మారేందుకే ఆయన డీకేతో సంప్రదింపులు జరిపారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే మల్లారెడ్డిపై భూకబ్జా కేసులు ఉండటంతోనే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్ లోని కొంత మంది నేతలు అడ్డు చెబుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ లో పరిస్థితి ఎలా ఉన్నా మల్లారెడ్డి మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదని కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ ఆయన ఓ షరతు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం గుప్పుమంటోంది. తనకు మంత్రి పదవి ఆఫర్ ఇస్తే పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రెడీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ వైపు భూకబ్జా ఆరోపణలు, గతంలో పార్టీపై, రేవంత్ రెడ్డిపై విమర్శల నేపథ్యంలో ఆయనకు మంత్రి వర్గంలో ఏ మేరకు ఛాన్స్ ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరూ ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో మంత్రివర్గంలో ఈ జిల్లాకు ఇంకా మంత్రి బెర్త్ ఖరారు కాలేదు. దానం నాగేందర్ కండువా మార్చి కాంగ్రెస్ లో చేరిపోవడంతో మంత్రివర్గ రేస్ లో ఆయన పేరు వినిపిస్తోంది. అయితే జీహెచ్ఎంసీకి చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరు ముందుగా పార్టీలో చేరితే వారికి ప్రయార్టీ దక్కబోతున్నదనే ప్రచారం నేపథ్యంలో మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ వైపే నిలుస్తారా లేక కాంగ్రెస్ లోకి వస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.

Tags:    

Similar News