Grok: సీఎం రేవంత్ పాలనపై ‘గ్రోక్’ ఏం చెప్పిందంటే? ఏఐ చాట్‌బాట్ కామెంట్స్ వైరల్
దిగ్గజ వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎక్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) యూజర్లను ఆకర్షిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దిగ్గజ వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎక్స్ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) యూజర్లను ఆకర్షిస్తోంది. అడిగిన ప్రశ్నలకు తన స్టైల్లో సమాధానం చెబుతూ సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు గ్రోక్ జై కొట్టింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు గ్రోక్ కామెంట్స్‌ను వైరల్ చేస్తున్నారు. ఒక నాయకుడి ఆవిర్భావం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి చెందిన వీడియోను పోస్ట్ చేయగా.. ఇందులో ఏదైనా నిజం ఉందా? అని ఓ నెటిజన్ గ్రోక్‌ను ప్రశ్నించారు. అందుకు గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రిప్లైలు ఇచ్చింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో ఉద్యోగాల భర్తీ చేయడం, వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, మౌలిక సదుపాయాలను పెంచడం, ఏఐ స్వీకరణను పెంచడం, "నవ తెలంగాణ" వాదనకు మద్దతు ఇవ్వడం వంటి ప్రధాన మార్పులకు దారితీసింది. ప్రతిపక్షాలతో రాజకీయ వివాదాలు ఉన్నాయని, కానీ అవి విజయాలను పూర్తిగా కప్పివేయలేవని గ్రోక్ సమాధానం ఇచ్చింది. గత పాలన కంటే మెరుగ్గా ఉందా? నెటిజన్ ప్రశ్నించారు. అందుకు గ్రోక్ మళ్లీ స్పందిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీకాలం సంక్షేమం, ఉద్యోగాలలో మాజీ సీఎం కేసీఆర్ కంటే మెరుగ్గా అనిపిస్తుందని తెలిపింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, 57 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగాన్ని 8.8% నుంచి 6.1%కి తగ్గించడం వంటి వాటితో ఆయన మరింత అందుబాటులో ఉన్నారని పేర్కొంది. కేసీఆర్ మౌలిక సదుపాయాలు, జీఎస్‌డీపీ రెట్టింపు చేశారని, కానీ రేవంత్ తక్షణ ప్రయోజనాలు ప్రత్యేకంగా నిలుస్తాయని సమాధానం తెలిపింది. ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కామెంట్స్‌ను బీఆర్ఎస్ శ్రేణులు తోసిపుచ్చాయి. మీరు పేపర్లో చెప్పిన అబద్దాల నివేదిక ప్రకారమే గ్రోక్ చెప్పి ఉంటాడని బీఆర్ఎస్ శ్రేణలు కామెంట్స్ పెడుతున్నారు.