నర్సింగ్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ప్రొఫెసర్ కోదండరాం

రాష్టంలో పలు సమస్యలతో సతమతమవుతున్న నర్సింగ్ అధికారుల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Update: 2024-06-27 14:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో పలు సమస్యలతో సతమతమవుతున్న నర్సింగ్ అధికారుల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం రాష్ట్ర సదస్సులో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సింగ్ అధికారుల సమస్యల పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని ఆరోపించారు.

నర్సింగ్ ఉద్యోగుల బదిలీల్లో స్థానికత పాటించ లేదని, డీఏ, పీఆర్సీ పెంపును పట్టించుకోలేదని అన్నారు. ఆసుపత్రుల్లో కనీసం నర్సింగ్ ఉద్యోగులకు దుస్తులు మార్చుకునే గది, తాగునీరు, వాష్‌రూంలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఫుర్తిగా విఫలమైందని ఆన్నారు. నర్సింగ్ అధికారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ముఖ్యంగా జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన నర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు అలాగే జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ప్రతి 100 పడకల ఆసుపత్రిలో ఐదు మంది హెడ్ నర్సుల నియామకానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు.

నర్సింగ్ వృత్తి మానవతా సేవ అని, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి, సరైన ఆరోగ్యం జీవన నాణ్యతను నిర్వహించడానికి ప్రజలకు సహాయపడుతుందని ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగన్న గౌడ్ తెలిపారు. అవసరమైన వైద్య సేవలను అందించే ఆరోగ్య సంరక్షణ అధికారుల శ్రేయస్సు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ‘ఆరోగ్యకరమైన తెలంగాణ’ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 7వేల మంది నర్సింగ్ అధికారులను నియమించిందని గుర్తు చేశారు.

సంఘం ఐక్యతతో ఉంటేనే హక్కులు సాదించబడుతాయని, ఆరోగ్య సంరక్షణ ప్రధాతలైన నర్సింగ్ అధికారులు సమస్యలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ‌ను కలసి పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సదస్సులో తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కవిత, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికిరణ్ పవ్వడి, ఉపాధ్యక్షులు ఎస్.సుజీవన్, కె.విజయశాంత్, ఈ.స్వాతి, సహాయ కార్యదర్శులు ఎండీ సలావుద్దీన్, కె.రామానాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శిలు జి.నరేంద్ర రాజన్, కె.వినోద్, కోశాధికారి జి.నరేష్, సంఘం సలహాదారు బి. వెంకటేశ్వర్ రెడ్డి, నేతలు రాజేందర్ రెడ్డి, నంద కుమార్, మొగిరాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News