లక్ష లోపు రుణాలన్ని మాఫీ చేస్తాం: మంత్రి హరీష్ రావు
రాంపూర్ గ్రామంలోని ఓట్లు అన్ని మంత్రి తన్నీరు హరీష్ రావుకే వేస్తామని సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: రాంపూర్ గ్రామంలోని ఓట్లు అన్ని మంత్రి తన్నీరు హరీష్ రావుకే వేస్తామని సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. శనివారం గ్రామానికి వచ్చిన మంత్రి హరీష్ రావును డప్పు చప్పులు, బోనాలతో గుర్రాల రథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మాణ ప్రతిని మంత్రి హరీష్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..గ్రామం చిన్నదైన గ్రామస్తులు పెద్ద మనస్సు చాటుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఏడోసారి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన అనంతరం తొలిసారిగా రాంపూర్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్య తీర్చినట్లు తెలిపారు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు తెలివిలేని మాటలు మాట్లాడుతున్నారని, లక్ష లోపు వ్యవసాయ రుణాలు అన్ని మాఫీ అవుతాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు తిట్టడంలో పోటీ పడుతుంటే.. సీఎం కేసీఆర్ పుట్ల కొద్ది వడ్లు పండించడంలో పోటీ పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కృషివల్లే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. రాంపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళల సహయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బిక్షపతి, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.