రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుంటాం.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

ఇందిరమ్మ ఇచ్చింది అని చెప్పి, నిరంతరం ఇందిర జపం చేస్తూ పర్యావరణ వినాశనం చెయ్యడమే ఇందిరమ్మ రాజ్యమా? అని మెదక్ (Medak) ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు.

Update: 2025-04-02 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఇచ్చింది అని చెప్పి, నిరంతరం ఇందిర జపం చేస్తూ పర్యావరణ వినాశనం చెయ్యడమే ఇందిరమ్మ రాజ్యమా? అని మెదక్ (Medak) ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. హెచ్‌సీయూ భూముల వేలం (HCU land auction) నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద బీజేపీ నేతలు (BJP Leaders) ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడని, అలాగే తెలంగాణలో పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పి హైడ్రా (Hydraa)ను తీసుకొచ్చాడని అన్నారు.

ఇప్పుడు కొన్ని వేల చెట్లు, వేల పశుసంపదకు నిలయంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలోని చెట్లను నరికివేయడాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) కళ్లు మూసుకొని ఎలా చూస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. 1973 లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి 2400 ఎకరాల భూములతో సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్ కు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి అందులో 400 ఎకరాలు మా ఇష్టారాజ్యం అమ్ముకుంటామని చెబుతున్నారని, ఈ అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకం న్యాయమేనని చెప్పింది ఎవరో చెప్పాలని అన్నారు. అలాగే ఎక్కడా అప్పు పుట్టడం లేదన్న రేవంత్ రెడ్డి పైసల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముతున్నాడని, ప్రభుత్వ భూములు అమ్ముకునే ఈ కార్యక్రమాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంలో బీజేపీ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుందని, రేవంత్ రెడ్డి వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎన్జీటీలో కూడా పిటిషన్లు వేస్తామని, ప్రజాప్రతినిధులంతా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. ఆ భూములను రక్షించి, విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇక విద్యార్థులకు ఏదో జరగరానిది జరిగిందని నాలుగు సార్లు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీకి ఈ రోజు అదే యూనివర్సిటీ కనిపించడం లేదా? విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా అయిపోయాక రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు చేతనైతే సెంట్రల్ యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు. మంత్రులు కోర్టులలో కేసులు గెలిచామని మాట్లాడుతున్నారని, ఒక్క మంత్రైనా కోర్టు ఆర్డర్ చదివారా అని మండిపడ్డారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ భూములను కాపాలని అంటే.. ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ భూములను అమ్మాలని చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకొని, విద్యార్థులకు అండగా ఉంటామని రఘునందన్ భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News