ప్రతి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తాం.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ ‌బాబు

హైదరాబాద్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.

Update: 2024-01-12 10:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం‌లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా, 6,500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శమని తెలిపారు. యువ వయసులో మంచి విద్య, ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించాలన్న భావతతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఒక దశా దిశ లేకుండా రాష్ట్రం నడిచిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొ్న్నారు. యువత కూడా ఒకే లక్ష్యం‌తో ముందుకు వెళ్లాలని, వివేకానంద స్ఫూర్తి‌తో లక్ష్య సాధన‌లో విజయం సాధించాలని ఆశిస్తున్నానని అన్నారు.

గ్రామీణ ప్రాంతంలో యువత పెడదారిపట్టే దారులునున్నాయని, కాబట్టి మాదక ద్రవ్యాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అనే మాట వినిపిం‌చొద్దని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలోని మరిన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన‌లో ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రం‌లో స్కిల్ సెంటర్ , స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన, వాటికి కావాల్సిన నైపుణ్యాన్ని వెలికతీసేందుకు స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని తేల్చిచెప్పారు.

తమది ప్రజల ప్రభుత్వమని, భాష విషయంలో బాధపడొద్దని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలతో యువతకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం లభిస్తుంది. దాంతో వారిలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని పేర్కొ్న్నారు. ఆర్టిఫషియల్ ఇంటెలిజెన్స్‌లో డిగ్రీ చదువుకన్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. ఆ రంగం‌లో కూడా యువతకి ఉపాధి‌తో పాటు రాష్ట్ర అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. సానుకూల దృక్పథంతో యువత ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, 35 వేల మందికి ఇప్పటికే పలు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు అందించినట్లు యూత్ సర్వీస్ విభాగం అధికారులు మంత్రికి తెలియజేశారు. మేళాలో ఉద్యోగం కోసం వచ్చిన యువతతో మంత్రి ప్రత్యేకంగా కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News