గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తాం : మంత్రి పొన్నం

నిపుణులు అయిన డాక్టర్ ల సమక్షంలో డైట్ మెనూ తో గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మందికి బలమైన ఆహారం అందిస్తామని

Update: 2024-12-14 09:09 GMT

దిశ, జూబ్లీహిల్స్: నిపుణులు అయిన డాక్టర్ ల సమక్షంలో డైట్ మెనూ తో గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మందికి బలమైన ఆహారం అందిస్తామని , మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో భోజనం, వసతి గృహాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు స్వయంగా పరిశీలించారు . ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11:30 గంటలకు , జూబ్లీహిల్స్, షేక్ పెట్‌లోని, హైదరాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బాయ్స్) లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సంక్షేమ పాఠశాల లో లైబ్రరీ నీ కంప్యూటర్ ల్యాబ్ లో అందుతున్న కోర్స్ లను, డిజిటల్ క్లాస్ రూం సీఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ లలో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు , ఎమ్మెల్యేలు ఈరోజు హాస్టల్ లలో సందర్శిస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి మా భవిష్యత్ మీద అని అభయమిచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్ లు ఇచ్చి బదిలీలు చేసి నియామకాలు చేపట్టి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించామన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 25 వేల పాఠశాలకు 11 వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి అన్నారు. పుస్తకాలు, డ్రెస్ లు సమయానికి అందిస్తున్నామన్నారు. ఇప్పుడున్న ధరలను పోలిస్తే 40 శాతం డైట్ చార్జీలు 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు. గతంలో కిరాయిల ఇవ్వలేదని గురుకుల అద్దె భవనాలు ఖాళీ చేసే పరిస్థితి ఉంటే.. అద్దె బిల్లులు చెల్లించా మన్నారు. మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తామన్నారు. రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలన్నారు. జూడో, చెస్‌ ఇక్కడ ఎక్కువగా ఆడుతున్నారన్నారని తెలిపారు. మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అకుంఠిత దీక్షతో చదువుకొని మీ ముందు మంత్రిగా ఇక్కడ ఉన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారని గుర్తుచేశారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి , టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం,ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గురుకులాల్లో చదివి ఇక్కడికి ఎదిగారని అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ నవ రత్నాలు స్థాపించి టెక్నికల్‌గా దేశం ఎక్కడికో ఎదిగిందన్నారు. మీరు మీ తెలివిని మెరుగు పరుచుకోవాలన్నారు. కరీంనగర్ లోక్ సభ ఆశీర్వాదంతో పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. మీ తల్లిదండ్రులకు గ్రామానికి తెలంగాణకి పేరు తెచ్చే విధంగా మీరు ఎదగాలని విద్యార్థులను కోరారు. మీకు మున్సిపల్ వాటర్ రేపటి నుండి ఉచితంగా వస్తాయన్నారు. ఈ గురుకలాల్లో ఒక బోర్ వేసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. మౌళిక వసతులు కల్పనకు రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. 20 మంది జూడో క్రీడాకారులకు జూడో డ్రెస్ లు కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుందన్నారు. ఈ స్కూల్ నుండి అక్కడ కూడా పెద్ద ఎత్తున సీట్లు సంపాదించాలన్నారు. నేను సౌత్ కొరియా.. పోయినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ చూసానని, ఆ చిన్న దేశానికి 34 ఒలంపిక్స్ మెడల్స్ వచ్చాయని తెలిపారు.

తెలంగాణ రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు పెరుగుతున్నాయని, నెల రోజుల్లో ఇక్కడ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. రవాణా నిబంధనలు పాటించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. రాబోయే కాలంలో రవాణా నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి.. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మీరు చెప్పింది కూడా వింటామన్నారు. ప్రభుత్వం రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 120 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో మీరు ఎప్పుడైనా పిల్లలతో కలిసి భోజనం చేశారా…? వారి సమస్యలు పరిష్కారం చేశారా…? అని ప్రశ్నించారు. ఇప్పుడు విద్యార్థుల మీద రాజకీయాలు చేస్తున్నారా? మీకు అండగా ఉంటాం.. మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. మీరు మంచిగా చదువుకొని మంచి పేరు సాధించాలని మంత్రి కోరారు.


Similar News