Minister Ponnam : బలవంతంగా కలుపబడ్డాం..
హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో కలుపే అంశం పై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో కలుపే అంశం పై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నిస్తున్నారు...? ఈ విషయానికి సంబంధించి కవ్వింపు చర్యలు అవసరం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రాంతం బలవంతంగా కలుపబడింది... డిలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాల్సి వస్తే ఎవరు ఆపలేరని దేనికైనా టైం వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ శాస్త్రీయంగా నిర్వహించే ఆలోచనలో ఉందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన పైన పటారం లోన లొటారం అన్న చందనా సాగిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెబుతున్న నాయకులు గత ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలల బకాయిలు, ఫీజు రియంబర్స్ మెంట్ ఎందుకు విడుదల చేయలేదని సూటిగా ప్రశ్నించారు. సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేదన్నారు. గ్రామ సర్పంచ్ లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అందరి బకాయిలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధ వంత మైన పాలన అందిస్తూ ఇచ్చిన వాగ్దానాలను నేర వేస్తున్నట్లు తెలిపారు.
లక్ష రూపాయల రుణ మాఫీ 5 వాయిదాల్లో చెల్లించిన నాయకులు రుణ మాఫీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు లక్షల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. రెండు లక్షల పై రుణం తీసుకున్న రైతుల విషయంలో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్నారు. రూ.2లక్షల రుణం కంటే ఎక్కువ ఉన్న రైతులు పై డబ్బులు చెల్లిస్తే రుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులను రుణ విముక్తులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రుణమాఫీ విషయంలో కుటుంబ సభ్యుల నిర్ధారణ సమస్యను అధిక మించి రుణాలు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాజకీయ పేరేపితంగా గురుకుల హాస్టల్స్ కు తాళాలు వేయడం, ఫీజు రియంబర్స్ మెంట్ పేరిట కాలేజీలు మూసి వేసి విద్య బోధనకు ఆటంకాలు కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల అద్దె బకాయిలు చెల్లించని విషయం గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు, విద్యార్థులకు సంబంధించిన బకాయిలు ప్రతిది చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, ఉపాధ్యాయ భర్తీ పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.1100 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. మూడు నాలుగు రోజుల్లో వైస్ ఛాన్స్ లర్ల నియామకం పూర్తి చేస్తామని వెల్లడించారు.
విద్య వ్యవస్థ ను ప్రతిష్ఠ పరిచేందుకు రూ.5వేల కోట్ల 25 ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్షం తేడా లేకుండా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజక వర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నెలకొల్పుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి ,సిద్దిపేట ,దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ లు పూజల హరికృష్ణ , చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.