వర్ధన్నపేటలో బార్లను తలదన్నేలా వైన్స్ షాపులు

వర్ధన్నపేటలో బార్లను తలదన్నేలా వైన్స్ షాపులు నిర్వహిస్తున్నారు.

Update: 2023-03-12 15:42 GMT

దిశ, అయినవోలు/వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో బార్లను తలదన్నేలా వైన్స్ షాపులు నిర్వహిస్తున్నారు. పర్మిట్‌ రూములకు పర్మిషన్ ఉన్నా కేవలం నిలబడి మద్యం తాగేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం కూర్చుని తాగడానికి, తినుబండారాలకు అనుమతి లేదు. కానీ వైన్స్ యజమానులు ఎక్సైజ్ శాఖ నిబంధనలను గాలికి వదిలేసి యథేచ్ఛగా సిట్టింగ్ ఏర్పాటు చేసి, మద్యం తాగే వారికి అన్ని రకాల తినుబండాలను అందుబాటులో ఉంచి, కూర్చున్న దగ్గరికి మద్యం, తిండి, వాటర్ బాటిల్స్ అందిస్తూ రెస్టారెంట్లను తలపిస్తున్నారు. దీంతో వైన్స్ షాప్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వైన్స్ యజమానులు ఇంతటి తో ఆగకుండా మద్యం అమ్మకాలలో కొత్త కొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు.


గతంలో వైన్స్ షాపుల వద్దకు వచ్చి బెల్ట్ షాపు నిర్వాహకులు చాటు మాటుగా మద్యం తీసుకెల్లేవారు. ప్రస్తుతం వైన్స్ యజమానులు బెల్టు షాపుల కోసం ప్రత్యేకంగా ఒక గోదాం ఏర్పాటు చేసి ఆటోలలో మద్యం సరఫరా చేస్తున్న దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాపులలో మద్యం విక్రయించడమే కాకుండా బెల్ట్ షాపులకు మద్యం తరలించడంతో గ్రామాలలో 24 గంటలు మద్యం ఏరులై పారుతోందని స్థానికులు అంటున్నారు. గ్రామాలలో సమయం సందర్భం లేకుండా మద్యం దొరకడంతో యువత పెడదారి పట్టడం తో పాటు ఘర్షణలు చోటుచేసుకుని మరణాలకు కారణమవుతున్న సంఘటనలు మండలంలో చోటు చేసుకున్నాయని, దీంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ఈ తతంగమంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముడుపులు ముట్టడంతో అటుగా చూడడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రించి, పర్మిట్ రూమ్ లపై నిఘపెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News