చెరువుల చెర వీడేదెప్పుడు..?

మండలంలో ఉన్న 80 పెద్ద, చిన్న, మధ్యతరహా చెరువులు,

Update: 2024-08-28 12:55 GMT

దిశ,మంగపేట : మండలంలో ఉన్న 80 పెద్ద, చిన్న, మద్యతరహా చెరువులు, కుంటలకు పట్టిన చెరవీడేదెన్నడని ఆక్రమణదారులపై కొరడా జులిపించి చెరువులు, కుంటలను కాపాడాలచాలని మండల ప్రజలు కోరుతున్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో 15 వరకు వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు ఉండగా మరో 65 చెరువులు, కుంటలు వంద లోపు ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవే కాక లక్షల రూపాయల విలువైన రెవిన్యూ, అటవీ భూములు సైతం ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన భూములు గడచిన 10 సంవత్సరాలలో అన్యాక్రాంతమైన నిర్మాణాలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ భూముల్లో వెలసిన కమర్షియల్ కాంప్లెక్స్ లు.. 

మండల కేంద్రంతో పాటు మంగపేట-భూర్గంపహాడ్ డబుల్ లేన్ ప్రధాన రహదారిపై మేజర్ గ్రామాలుగా ఉన్న కమలాపురం, నర్సాపురం బోరు, మల్లూరు, చుంచుపల్లి, వాడ గూడెం, రమణక్కపేట, రాజుపేట, దోమెడ చెక్ పోస్టు వరకు ఉన్న గ్రామాలలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఆక్రమించుకొని భవన నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆయా అధికారులను మచ్చిక చేసుకున్న ఆక్రమణదారులు లక్షల విలువైన ప్రభుత్వ భూములను యదేశ్చగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆక్రమణదారులపై కొరడా జులిపించాలి..

మండలంలోని చెరువులు, కుంటల ఆక్రమణలతో పాటు విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించాలని మండల ప్రజల నుండి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. హైద్రాబాద్ హైడ్రా తరహాలోనే ప్రతి మండలంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు గురైన మండలంలోని చెరువులు, కుంటలతో పాటు విలువైన ప్రభుత్వ ఆస్థులను గుర్తించి సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తూముల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలి : తహసీల్దార్ వీరాస్వామి

మండలంలోని చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల ఆక్రమణలపై అప్పటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నివేదికలిచ్చామని తహసీల్దార్ వీరాస్వామి తెలిపారు. మండలంలోని పెద్ద చెరువులలో జరిగిన ఆక్రమణలు నివారించేందుకు ఐబీశాఖ నుండి తూముల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపో నందు వాటికి టెండర్లు పిలవలేదని అన్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలిచ్చామని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు.

80 శాతం చెరువుల్లో ఆక్రమణలే : ఐబీ ఏఈ వలీం మహ్మద్

మండలంలోని 80 పెద్ద, చిన్న చెరువులు, కుంటలలో దాదాపుగా ఆక్రమణలోనే ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మండలంలోని మల్లూరు అత్త కోడలు, నర్సాపురం బోరు చెరువుల ఆక్రమణలపై దిశలో వచ్చిన కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠి చెరువుల ఆక్రమణలపై రెవెన్యూ, ఐబీ శాఖలతో ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు. తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సర్వే చేయడం వీలుకాలేదని అన్నారు. ఐబీ శాఖలోని సిబ్బంది కొరతతో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ణయించి నప్పటికీ రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ట్రెంచ్ కొట్టాల్సి ఉందని త్వరలోనే ఇరు శాఖలతో కలిసి సర్వే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.


Similar News