ఆ శబ్ధాలకు కారణాలేంటి..?
చెల్పాక ఎన్‌కౌంటర్ సంఘటన స్థలం నుంచి ఆదివారం ఉదయం 11:15నిముషాలకు, మధ్యాహ్నం 12:30గంటలకు తుపాకులు పేలిన శబ్దాలు రావడం కలకలం రేపింది
దిశ, వరంగల్ బ్యూరో/ ఏటూరునాగారం : చెల్పాక ఎన్‌కౌంటర్ సంఘటన స్థలం నుంచి ఆదివారం ఉదయం 11:15నిముషాలకు, మధ్యాహ్నం 12:30గంటలకు తుపాకులు పేలిన శబ్దాలు రావడం కలకలం రేపింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు హతమైన విషయం తెలిసిందే. అయితే సంఘటన స్థలాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసు బలగాలు...ఘటన స్థలంలోకి మీడియాను సైతం వెళ్లకుండా అడ్డుకున్నారు. ఘటన స్థలంలో ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు అప్పటికే వెల్లడించారు. ఘటన స్థలానికి కొద్దిదూరంలో వేచి ఉన్న మీడియా ప్రతినిధులకు ఉదయం 11:15నిముషాలకు నాలుగు రౌండ్లు తుపాకి పేలిన శబ్ధం వినిపించింది. అలాగే మధ్యాహ్నం 12:30గంటలకు తుపాకులు పేలిన శబ్దాలు రావడం గమనార్హం. అయితే ఈ విషయంపై పోలీస్‌శాఖ స్పష్టత ఇవ్వలేదు. పోలీస్ అధికారులు మాత్రం..ఇప్పటికీ ఘటన స్థలంలోకి వెళ్లడం శ్రేయస్కరం కాదని, ఆపరేషన్ కొనసాగుతోందంటూ వ్యాఖ్యనించడం గమనార్హం. ఎన్‌కౌంటర్ పూర్తయిన పోలీసులు ప్రకటించిన తర్వాత వచ్చిన తుపాకుల శబ్ధానికి కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి.
ఆలస్యంగా ప్రక్రియ..!
ఎన్‌కౌంటర్ ఘటన స్థలంలోకి వెళ్లకుండా మీడియాకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఘటన స్థలానికి బైక్ పై ఎస్పీ శబరీష్ చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత గాని పంచనామా ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో దట్టమైన అటవీ ప్రాంతం నుంచి మృతదేహాలను తీసుకుని ఆదివారం తొమ్మదిన్నర గంటల సమయంలో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.