ఇచ్చిన హామీలను విడతల వారిగా అమలు చేస్తున్నాం : మంత్రి సీతక్క
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తాను ములుగు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పేద ప్రజల అభిప్రాయం మేరకే ప్రజాప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

దిశ, ములుగు ప్రతినిధి : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తాను ములుగు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పేద ప్రజల అభిప్రాయం మేరకే ప్రజాప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామం నుండి జగ్గన్న గూడెం గ్రామం వరకు 33 కోట్ల రూపాయలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాయిని గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనేక సంవత్సరాలుగా లోతట్టు ఏజెన్సీ గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని పాలకులకు మొరపెట్టుకున్నప్పటికీ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. గ్రామాలలో రోడ్డు పనులే కాకుండా జంగాలపల్లి గ్రామం నుండి జగ్గనగూడెం గ్రామం వరకు చేపట్టిన ప్రధాన రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయని అన్నారు. జగ్గన్నగూడెం గ్రామం వద్ద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో లెవల్ బ్రిడ్జి నిర్మించిందని, అయినప్పటికీ ఏజెన్సీ గ్రామాల ప్రజల ఇబ్బందులను గుర్తించి ఐదు కోట్ల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారని తెలిపారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు రెండు పంటలు పండించుకోవడానికి కాల్వల ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నామని అన్నారు.
ఏజెన్సీ గ్రామాలలోని ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వారంలోగా చేపడతామని, లబ్ధిదారుల ఎంపిక పక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెనుకబడిన ప్రజల కలలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్నానని, రానున్న రోజుల్లో ములుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం గోవిందరావుపేట మండలం దుంపలగూడెం గ్రామంలో కలెక్టర్ దివాకర తో రైతులు, వర్ష బాధిత కుటుంబాలతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో అకాల వర్షం కారణంగా నోటి కాడికి వచ్చిన పంట దెబ్బ తినడం బాధాకరమని, ఇదే సందర్భంలో పలు రకాల ఇండ్లు కూలిపోవడం జరిగిందని అన్నారు. వర్షం అనంతరం జిల్లా యంత్రాంగం నష్టపోయిన పంట వివరాలు సేకరణ, కూలిపోయిన ఇండ్ల వివరాల సేకరణలో నిమగ్నమైందని పూర్తి వివరాల సేకరణ అనంతరం నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు, బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ నుండి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని సీతక్క హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా వంట సామాగ్రి తో పాటు 2 వేల 5 వందల రూపాయల నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, మండల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.