అసైన్డ్ భూమి హాంఫ‌ట్‌.. ఆక్రమ‌ణ‌దారుడికి పుష్కలంగా అండ‌దండ‌లు

అసైన్డ్ భూమిని అధికార పార్టీకి చెందిన‌ నేత బాజాప్తాగా క‌బ్జా చేసేస్తున్నారు....

Update: 2024-09-16 03:05 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: అసైన్డ్ భూమిని అధికార పార్టీకి చెందిన‌ నేత బాజాప్తాగా క‌బ్జా చేసేస్తున్నారు. హ‌న్మకొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం వంగ‌ప‌హాడ్ గ్రామ రెవెన్యూ స‌ర్వే నెంబ‌ర్ 516లోని ప్రభుత్వ అసైన్డ్ భూమి క‌బ్జాకు గుర‌వుతోంది. సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా క‌బ్జా చేసేస్తున్నారు. గ‌వర్నమెంటు భూమిలో పాగా వేసి అబ్బే ఇది ప‌ట్టా ల్యాండ్ అంటూ బుకాయిస్తున్నారు. అక్రమాన్ని స‌క్రమం చేసేందుకు రెవెన్యూ అధికారులు త‌మ వంతు సాయం చేసేసిన‌ట్లు స్పష్టమ‌వుతోంది. అదేం లేదు.. ఇది ఇప్పుడు అప్పుడెప్పుడో జ‌రిగింది..! మేం చేయ‌లేదు... అంటూ ప్రస్తుత అధికారులు వివ‌ర‌ణ ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే అక్రమం అని తెలిసి కూడా చ‌ర్యలు తీసుకోవ‌డానికి మాత్రం స‌వాల‌క్ష కార‌ణాలు చెబుతున్నారు. మున్సిపల్‌, రెవెన్యూ శాఖ‌ల అధికారులు ఒక‌రిపై ఒక‌రు తోసేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం చేస్తూ ప్రజ‌ల‌కు న‌ష్టం చేకూరుస్తున్నారు.ఈ మొత్తం వ్యవ‌హారంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పాపం భాగ‌స్వామ్యం స్పష్టంగా క‌నిపిస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే...?!

హ‌న్మకొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం వంగ‌ప‌హాడ్ గ్రామ రెవెన్యూ స‌ర్వే నెంబ‌ర్ 516లోని ప్రభుత్వ అసైన్డ్ భూమి క‌బ్జాకు గుర‌వుతోంది. 516 స‌ర్వే నెంబ‌ర్ మొత్తం 197 ఎక‌రాల 20 గుంట‌ల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో నాలుగు ఎక‌రాలను గ‌తంలో రాష్ట్ర ప్రభుత్వం మోడ‌ల్ స్కూల్‌కు, రెండెక‌రాలు.. ప్రాథ‌మిక స‌హ‌కార సంఘం భ‌వ‌నం నిర్మాణానికి రెండెక‌రాల స్థలాన్ని కేటాయింపు చేసింది. అయితే ఈ స్థలం కూడా క‌బ్జాకు గురువుతోంది. ఇదిలా ఉండ‌గా కొద్ది రోజుల నుంచి సుమారు 18 గుంట‌ల అసైన్డ్ భూమిలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత క‌బ్జాకు తెర‌లేపారు. భూమిని చ‌దును చేసి గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓ షెడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసేశారు. జాతీయ ర‌హ‌దారి 163కి ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ సుమారు రెండున్నర కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.

అధికారుల చ‌ర్యలేవీ..?

బీఆర్ఎస్ హ‌యాంలో నాటి ముఖ్య నేత క‌నుస‌న్నల్లోనే ఈ భూఅక్రమణ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తుండ‌గా, తాజాగా అధికార పార్టీలోని నేత‌ల సాయంతో భూ అక్రమం బ‌య‌ట ప‌డ‌కుండా ఆక్రమ‌ణ‌దారుడు వ్యవ‌హ‌రిస్తున్నట్లుగా తెలుస్తోంది. య‌థేచ్ఛగా సాగిన అక్రమాల వెనుక అధికారుల‌కు మాములుగా స‌హ‌క‌రించ‌డంతో వారు కూడా గ‌ప్‌చుప్‌గా ఉంటున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. అక్రమాల‌పై నేరుగా రెవెన్యూ అధికారుల ఫిర్యాదులు వెళ్లినా స్పందించ‌క‌పోవడం అనుమానాల‌కు తావిస్తోంది. నాటి అక్రమాల‌పై నేడు ఆధారాల‌తో స‌హా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు గాని, రెవెన్యూ అధికారులు గాని ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


Similar News