విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు : మంత్రి సీతక్క
విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని మంత్రి
దిశ, ములుగు ప్రతినిధి: విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని మంత్రి సీతక్క అన్నారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్వాల్ కం కంపెనీ, ట్రాన్స్ఫర్ పాఠశాలల యాజమాన్యం సంయుక్తంగా 9, 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన పాఠశాల బోధనలను బోధించడానికి ఇంగ్లీష్, గణితం, సైన్స్ పాఠాలను బోధించే అధ్యాపకులకు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, ప్రిన్సిపాల్ ఎన్‌కైనర్, క్వాల్‌కామ్ సుధీర్ కుమార్ సుంకర, ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రద్ధా ఝా, హెడ్-ప్రోగ్రామ్ & క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ నేహా రానా లతో కలిసి పుస్తక ఆవిష్కరణ చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన చేస్తే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు.
అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోతున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి ఉపాధ్యాయులకు స్వచ్ఛంద సంస్థల వారు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం ఆశించదగ్గ విషయమై అన్నారు. ప్రపంచ విషయాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలుసుకున్నప్పుడే విద్యా బోధన మెరుగుపడినట్లు అవుతుందని, ఈ విషయంలో గ్రామీణ ప్రాంతంలో విద్య బోధించే ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. రెండు సంస్థల వారు మెరుగైన విద్యను బోధించడానికి ఇతర రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఆ రెండు సంస్థలు రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా ములుగు లో నిర్వహించడం జిల్లా కలెక్టర్ కృషి యేనని కొనియాడారు. అన్ని దానాలలో కన్నా విద్య దానం గొప్పదని ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలు విద్య అభ్యసించే విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలని, ప్రతిరోజు విద్యార్థుల అభ్యసించిన విద్యపై ఒక గంట పాటు సమయం కేటాయించి ఉత్తమ విద్యార్థుల తీర్చిదిద్దాలని అన్నారు.
సమాజానికి మనం ఏం చేస్తున్నామో అదే తరహాలో సమాజం మనకు మేలు చేస్తుందని, రాష్ట్రంలో అద్భుతమైన మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి 20 సంస్థలతో ఒప్పందం జరిగిందని ఆయా సంస్థల సహకారంతో ప్రజలకు అవసరం ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పట్టణాల్లో ఉన్న విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పలు విషయాలలో అవగాహన కలిగి ఉంటారని, ఒక ఇంట్లో ఒకరు చదువుకొని ఉంటే ఆ కుటుంబం పూర్తిస్థాయిలో బాగుపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతకుముందు జాకారంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల లో ములుగు జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ ప్రదర్శనను మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల నుండి శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవాలని, గతంలో శాస్త్రవేత్తలు అంతా కూడా సమాజాన్ని, ప్రకృతిని పరిశీలించి అనేక రకాల ఆవిష్కరణలు చేయడం జరిగింది, అందులో భాగంగా విమానాన్ని తయారు చేయడం, ఓడలు తయారు చేయడం. ఇవన్నీ కూడా సహజసిద్ధంగా పక్షులు మరియు చేపల యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆవిష్కరణ చేశారనీ అన్నారు.
నేటి విద్యార్థులు కూడా మన భారతీయ శాస్త్రవేత్తల జీవితాలను, వారి ఆవిష్కరణను ఆదర్శంగా తీసుకొని నిత్యము పరిసరాలను పరిశీలిస్తూ సహజ సిద్ధ పరిస్థితులను గమనిస్తూ తద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకొని భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ఏ వెంకటేశ్వర్లు, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు వివిధ సంఘాల జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.