సరస్వతి నిలయం, సారాయి వలయం..
కేసముద్రం స్టేషన్ హై స్కూల్, కొందరు మందు ప్రియులకు అడ్డాగా మారుతోంది.
దిశ, కేసముద్రం : కేసముద్రం స్టేషన్ హై స్కూల్, కొందరు మందు ప్రియులకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో పేరు తెచ్చుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు పర్యవేక్షణ లేక, మందుబాబులకు అడ్డాగా మారింది. స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలో ఏర్పడ్డ ఈ పాఠశాలకు 90వ దశకం ప్రారంభం వరకు నెల్లికుదురు మండలం ఆలేరు, నాగారం నుండి గూడూరు మండలం తీగలవేనీ, రాజన్ పల్లి నుండి నెక్కొండ మండలం తోపనిపల్లి, అలంకానిపేట, కేసముద్రం మండలం ఇనుగుర్తి నుండి కూడా చదువటానికి కేసముద్రం స్టేషన్ హై స్కూల్ కి సుమారు 1500 మంది వచ్చి చదివేవారు, అలాంటి ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాల నేడు పర్యవేక్షణ లేక మందుబాబులకు నిలయంగా మారుతోంది.
మందు ప్రియులు బీరు సీసాలను కొనుగోలు చేసుకుని ప్రతి రోజు రాత్రి పాఠశాల ఆవరణకు చేరుకుని వరండాలో కూర్చుని అక్కడే బీర్లు తాగి సీసాలు అక్కడే పడేస్తున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు బీరు బాటిళ్లు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా ఖంగుతుంటున్నారు. గ్రామానికి చెందిన పలువురు మందుబాబులు, వారు కూడా ఇక్కడే చదువుకున్నామన్న విషయాన్ని మర్చిపోయి పాఠశాల గ్రౌండ్లో తాగుబోతులకు అడ్డాగా మల్చుకోవడం పట్ల పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..
ఈ సంవత్సరం కురిసిన అతి భారీ వర్షాలకు పాఠశాల ముందరి ప్రహరీ, గేటు కూలిపోయాయి, అప్పటినుండి ఈ పాఠశాలకు రక్షణ కరువైంది. పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, గేటు ఏర్పాటు చేయాలి అని ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని విద్యార్థులు కోరుతున్నారు. మందుబాబులు పాఠశాలలో కూర్చొని మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.