భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సీతక్క
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ
దిశ, ములుగు ప్రతినిధి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని , ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శభరిష్ లతో కలిసి గోవిందరావుపేట మండలం లో గుండ్ల వాగు, జంపన్న వాగు వరద ప్రవాహాన్ని, తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు , జలగలను వాగు, మేడారం జంపన్న వాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో 26 సెంటీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదయిందని ముఖ్యంగా మేడారం- తాడ్వాయి రహదారి పై గాలి వాన బీభత్సానికి సుమారు 200 చెట్లు ధ్వంసం అయ్యాయని మరికొన్ని చెట్లు రహదారికి అడ్డంగా పడిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడిందని వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు.
2022 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదలను 2023 సంవత్సరంలో వచ్చిన జంపన్న వాగు వరదలను వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తుగా అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశామని, ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో స్థానిక తహసీల్దార్ ,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎంపీడీవో, ఇతర అధికారులతో ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ వరద ప్రవాహాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఒక అధికారిని వాగు, తొగు ల మధ్య ఉంచమని ఇలాంటి ప్రమాదం వచ్చిన వెంటనే స్థానిక ప్రజలను కాపాడడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని ముందస్తు ప్రణాళిక ద్వారా జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉందని అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని ప్రజలందరూ స్వీయ రక్షణ పాటించాలని కూలిపోయే ప్రమాదంలో ఉన్న గృహాల నుంచి ప్రజలు అధికారులకు సహకరిస్తూ ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, వాగు ప్రవాహాలను తక్కువ అంచనా వేసి ఎవరూ కూడా దాటే ప్రయత్నం చేయకూడదని వాగుల వద్ద ఉండే అధికారులకు సహకరించాలని కోరారు.
జిల్లాలో నార్లాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పిడుగు పడటం ద్వారా , కాల పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పశువుల కోసం వెళ్లి బురద గుంటలో చిక్కుకొని మృత్యువాత పడ్డారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాలలోని పరిస్థితులను మానిటరింగ్ చేయడం జరుగుతుందని రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారని , ప్రకృతి విపత్తు సమయం లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందిస్తూ స్థానిక యువత రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాలు కాపాడడంలో అండగా నిలవాలని కోరారు.
ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని కావున జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు వాగుల యొక్క వరద ఉధృతిని పరిశీలించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలందరూ అత్యవసర పరిస్థితి ఉంటేనే మాత్రమే బయటికి రావాలి అని, అలాగే విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ తీగలకు దూరం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ అలెం అప్పయ్య , డి.ఎస్.పి రవీందర్, తాడ్వాయి తహసీల్దార్ రవిందర్, జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.