దళితులకు పాడి గేదెల పథకం.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట నియోజక వర్గ ప్రజల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా మరో పైలట్ ప్రాజెక్ట్ ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకొచ్చారు.

Update: 2023-03-10 10:12 GMT

దిశ, నర్సంపేట: నర్సంపేట నియోజక వర్గ ప్రజల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా మరో పైలట్ ప్రాజెక్ట్ ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకొచ్చారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళితులకు ప్రత్యేకంగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా పాడి గేదెల పథకాన్ని అమలు చేయనున్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1000 యూనిట్లు (ఒక్క యూనిట్ కు రూ.2 లక్షలతో రెండు గేదెలు) అందించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. ఈ పైలట్ పథకంలో మొత్తం రూ.14 కోట్ల సబ్సిడీ నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు.

ఈ పథకంలో భాగంగా విజయ డెయిరీ వారి గ్యారెంటీతో ఒక్కో యూనిట్ కి రూ.60 వేల నగదును బ్యాంకు రుణం కింద రైతులకు అందిస్తారని తెలిపారు. రూ.లక్షా 40 వేల సబ్సిడీ పోను మిగతా 60 వేల రూపాయలను విజయ డెయిరీ వారికి పాలు పోసి బ్యాంక్ రుణం తీర్చేలా ఒప్పందం ఉందన్నారు. ఈ నేపథ్యంలో దళితుల పైన ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ఎలాంటి పూచీకత్తు లేకుండా, భూమిలేని వారికి కూడా ఈ పథకం వర్తించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. నర్సంపేట నియోజక వర్గంలోని మండలాల వారీగా మంజూరైన 1000 యూనిట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నెక్కొండ 200 యూనిట్లు, నల్లబెల్లి 150 యూనిట్లు, ఖానాపూర్ 100 యూనిట్లు, నర్సంపేట రూరల్ 150 యూనిట్లు, దుగ్గొండి 200 యూనిట్లు, నర్సంపేట టౌన్ 50 యూనిట్లు, చెన్నరావుపేట 150 యూనిట్లు. ఒక్కో యూనిట్ కు 70 శాతం సబ్సిడీతో మొత్తం రూ.14 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. గతంలో నర్సంపేట నియోజకవర్గానికి 650 యూనిట్లను (ఒక్కో యూనిట్ కు నాలుగు గేదెల చొప్పున) మంజూరు చేయించి దళిత రైతులకు పంపిణీ చేసిన సంగతిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. మరో వారం రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే పెద్ది స్పష్టం చేశారు. కావున నియోజకవర్గ దళితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News