‘రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి..’
గ్రామ పంచాయతీల వారీగా ఓటర్, పోలింగ్ స్టేషన్ల జాబితాను
దిశ, హనుమకొండ : గ్రామ పంచాయతీల వారీగా ఓటర్, పోలింగ్ స్టేషన్ల జాబితాను రూపొందించాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా తయారీపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలతో హైదరాబాద్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి పనికి మాడ్యుల్ ఉందని, దీని ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఓటర్ జాబితా తయారీ, మ్యాపింగ్ పనులు చేసేందుకు ప్రతి మండలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూసుకోవాలని సూచించారు.
అన్ని మండలాల్లో కావాల్సిన అధికారులు, సిబ్బంది ఉన్నారో లేదో తెలుసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఓటర్ జాబితాకు అనుగుణంగా గ్రామాల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 600-650 మంది ఓటర్లు ఉండేలా చూసుకోవాలని, ఓటర్లను బట్టి కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా ఎదురైన సమస్యలు గుర్తించాలని, మరోసారి రాకుండా చూడాలని ఆదేశించారు.
ఓటర్ జాబితా ప్రదర్శన..
వార్డుల వారీగా రూపొందించిన ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను 06-09-2024 తేదీన అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాలని, 09-09-2024 జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలతో జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, 10-09-2024 తేదీన ఎంపీడీఓ ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు 07-09-2024 నుంచి 13-09-2024 స్వీకరించాలని, ఆర్డీవో ల ఆద్వర్యంలో వాటిని చేపట్టాలని సూచించారు. అభ్యంతరాలు 19-09-2024 తేదీలోగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా పూర్తి చేయాలని, పూర్తి స్థాయి వార్డులు, ఫోటోలు, ఓటర్ల జాబితాను 21-09-2024 తేదీన అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కు ప్రశంసలు..
ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్, రూపొందించడంలో ఉత్తమ ప్రతిభను చూపినందుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రశంసించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ లు 208 ఉండగా, మొత్తం మెర్జింగ్ ప్రక్రియ 85 శాతం పూర్తి అయ్యిందని, మిగతా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 3, 73, 900 మంది ఉన్నారని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవోలు వెంకటేష్, నారాయణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.